https://oktelugu.com/

Chandrayaan 3: జయహో భారత్.. వెయ్యి నోళ్ళ కీర్తించిన ప్రపంచ మీడియా

ఇస్రో సాధించిన విజయం పట్ల మన దాయాది పాకిస్తాన్ కూడా స్పందించింది. భారత్ గొప్ప ప్రయోగం చేసిందని కీర్తించింది.

Written By:
  • Rocky
  • , Updated On : August 25, 2023 / 02:42 PM IST

    Chandrayaan 3

    Follow us on

    Chandrayaan 3: చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్_3 సురక్షితంగా దిగడాన్ని ప్రపంచ దేశాలు మొత్తం కీర్తించాయి. ఇతర దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్ సొంతం చేసుకోవడం పట్ల అభినందనలు కురుస్తోంది. ఇలాంటి అసాధ్యాన్ని భారత్ సుసాధ్యం చేసిన నేపథ్యంలో అమెరికా నుంచి మొదలు పెడితే అన్ని దేశాల ప్రధాన పత్రికలు పతాకస్థాయి శీర్షికలతో గురువారం ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. ఇది భారతదేశం సాధించిన అపూర్వ విజయమని కొనియాడాయి. గతంలో మంగళయాన్ మిషన్ ను ఉద్దేశించి వ్యంగ్యమైన కార్టూన్ ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్ కూడా భారతదేశానికి ఇది అతి పెద్ద విజయం అని కొనియాడింది. వాషింగ్టన్ పోస్ట్ రెండు కథనాలను, మహత్తరమైన వ్యాసాన్ని ప్రచురించింది. ఇది భారతదేశానికి చారిత్రాత్మక విజయం అని పేర్కొన్నది.

    చంద్రుడి పైకి భారత్ చేరుకుంది

    ఇక ప్రఖ్యాత ది వాల్ స్ట్రీట్ జర్నల్ చంద్రయాన్_3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఇది భారత్ కు చారిత్రాత్మక విజయం అని పేర్కొన్నది. చంద్రుడి దక్షిణ ధ్రువం పై భారత్ చారిత్రాత్మక ల్యాండింగ్ చేసిందని బిబిసి కొనియాడింది. 21వ శతాబ్దంలో చంద్రుడి మీద చైనా తర్వాత అడుగుపెట్టిన రెండవ దశంగా భారత్ అవతరించిందని వివరించింది. ఇక సీఎన్ఎన్ అయితే సరికొత్త కథనాలను ప్రచురించింది. చంద్రుడి మీద భారత్ సరికొత్త చరిత్ర లిఖించిందని కీర్తించింది. అంతరిక్ష రంగంలో ఆధిపత్యం కోసం పోటీపడే దేశాల జాబితాలో భారత్ ను అగ్రస్థానంలో నిలిపే విధంగా ఇస్రో ప్రయోగాలు చేస్తూందని బిబిసి సైన్స్ ఎడిటర్ రెబెక్కా మోరల్ వ్యాఖ్యానించారు. శాంతియుత ప్రయోజనాలకు అంతరిక్షాన్ని వాడుకోవడంలో భారత్ పెద్ద విజయం సాధించిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. ఈ మిషన్ లో తాము కూడా భాగస్వామి కావడం అందంగా ఉందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలహరిస్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇస్రోకు అభినందనలు తెలిపారు.

    పాక్ మీడియా కూడా

    ఇస్రో సాధించిన విజయం పట్ల మన దాయాది పాకిస్తాన్ కూడా స్పందించింది. భారత్ గొప్ప ప్రయోగం చేసిందని కీర్తించింది. ఆ దేశానికి చెందిన మీడియా పతకస్తాయి శీర్షికలతో వార్తలు ప్రచురించింది. భారత్ సాధించిన విజయం పట్ల విస్తృతమైన కవరేజ్ ఇచ్చింది. శ్రీలంక అధ్యక్షుడు విక్రమ సింఘె భారత్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా అభినందనలు తెలిపిన ప్రపంచ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇస్రో సాధించిన విజయం పట్ల వ్యక్తం చేశారు. నాడు ఇందిరాగాంధీ, నెహ్రూ ఇస్రో ప్రయోగాల సందర్భంగా దిగిన ఫోటోలను కాంగ్రెస్ అగ్ర నాయకుడు జయరాం రమేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.