Holy: వసంత రుతువులో వచ్చే ముఖ్యమైన పండుగ హోలీ. భాగవత పురాణం ప్రకారం రాధాకృష్ణుల ప్రేమకు చిహ్నంగా హోలీ పండుగ నిర్వహిస్తారని అంటారు. శివపురాణ ప్రకారం.. పరమశివుడు అన్నింటిని వదిలి తన ధ్యానంలో ఉంటాడు. ఆందోళన చెందిన పార్వతీ దేవీ కాముడి సహాయం కోరుతుంది. అయితే కాముడు శివుడిపై మన్మథబాణం వేయడంతో శివుడు కోపోద్రిక్తుడై మూడో కన్ను తెరుస్తాడు. దీంతో కాముడు భగ్నం అవుతాడు. అన్నీ వేళలా కామం తగదని ఈ చరిత్ర తెలుపుతుంది. దీంతో హోలీకి ముందు రోజు కామదహనం నిర్వహించి ఆ తరువాత హోలీ పండుగ నిర్వహించుకుంటారు.
హోలీ పండుగ రోజు ఒకరినొకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతారు. యువత స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటుంది. అయితే ఇదే రోజు కొందరు సంతోషంగా ఉందామని మత్తు పానీయాలు తీసుకుంటారు. ఇందులో భాగంగా కొందరు కలిసి మద్యం సేవిస్తారు. కానీ ఇలాంటి వారికి హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీష్ స్టేషన్ల పరిధిలో మద్యం షాపులు మూసివేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. .
2024 సంవత్సరంలో మార్చి 25న హోలీ పండుగ నిర్వహించుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వేడుకల్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే మార్కెట్లో వివిధ రంగుల అమ్మకాలు, హోలీకి సంబంధించిన వస్తువులు విక్రయాలు చేస్తున్నారు. కొందరు ఆరోజున సరదాగా ఉండేందుకు ప్రత్యేక సెలవులు పెడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ఒక్క చోటుకు చేరి సంతోషంగా ఉండేందుకు రెడీ అవుతున్నారు.
అయితే ఈ హోలీ వేడుకలు విషాదంగా మారకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆరోజున రోడ్డుపై వెళ్లేవారిపై రంగులు చల్లకూడదని, తెలియని వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈనెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసేయాలని పోలీసులు నిర్ణయించారు. స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్ లు మాత్రం ఓపెన్ చేసి ఉంటాయని పేర్కొన్నారు.