Himachal : దేశంలో అత్యధిక తలసరి అప్పుల రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తికి రూ.1.17 లక్షల అప్పుల భారం ఉంది. ఈ చిన్న రాష్ట్రం అప్పు ఇప్పుడు రూ.86,589 కోట్లకు చేరుకుంది. మరోవైపు కొత్త పింఛను పథకం అమలు వల్లే రాష్ట్రం రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఒకవైపు ఉన్న అప్పుల భారం, మరోవైపు కొత్త అప్పులపై ఆంక్షలు, పెరిగిన పథకాల భారం ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. చివరకు పింఛను శాఖలోని పింఛనుదారుల సంక్షేమ నిధి సొమ్మును కూడా ప్రభుత్వం వినియోగించుకుంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలను కూడా వాయిదా వేస్తూ మంత్రివర్గం నిర్ణయాలను తీసుకుంటుంది.
ప్రధానంగా మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వడం వల్ల ఆర్థికంగా భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ పథకాల భారం రాష్ట్రం మోయలేదని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు వాటికి కోత పెట్టడం ప్రారంభించింది. అన్ని కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు. అంతేకాదు, ఇప్పటికే 125 యూనిట్ల విద్యుత్ సబ్సిడీని తగ్గించింది. బీపీఎల్ పరిధిలోని వారికే సబ్సిడీ వర్తిస్తుందని ప్రకటించింది. మొత్తం 14 సబ్సిడీలను తగ్గించేందుకు సిద్ధమైంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని తొలగించి టికెట్‌లో 50 శాతం వసూలు చేయాలని నిర్ణయించింది. ఉచిత నీటి సరఫరా పథకాన్ని నిలిపివేయాలని భావిస్తోంది.
అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలను అమలు చేయలేదని ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరోవైపు ఉన్న పథకాలకు కూడా కోత పడుతుండటం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో కాంగ్రెస్ కు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, అలవెన్సులు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, పెన్షన్ సంక్షేమ నిధి నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే ఆర్థిక సంక్షోభానికి కారణమని దుయ్యబడుతున్నారు.
హామీల పేరుతో గెలిచిన కర్ణాటక, తెలంగాణల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కర్ణాటకలో హామీల అమలు వల్ల రాష్ట్రంపై తీవ్ర ఆర్థిక భారం పడింది. దీంతో ధరలను పెంచి ఖజానా నింపుకునేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం యత్నిస్తోంది. మరోవైపు హామీల అమలుపై పునరాలోచన చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హామీలు అమలు చేయలేని కారణంగానే ఈ డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారనే వాదన వినిపిస్తోంది. పైగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా హామీల అమలును పట్టించుకోవడం లేదు. ఒకటి రెండు హామీలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా లబ్ధిదారులందరికీ అందిన పరిస్థితులు కనిపించడం లేదు. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తీరు చూస్తోన్న విశ్లేషకులు కేవలం ఎన్నికల్లో గెలవడానికే ఇష్టారాజ్యంగా వాగ్దానాలు చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
నేడు పథకాలు, సబ్సిడీల్లో కోత విధించేందుకు హిమాచల్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రేపు కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాలు కూడా అదే వైఖరిని అవలంభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. 40ఏళ్ల చంద్రబాబు రాజకీయ అనుభవంతో అచరణకు సాధ్యమయ్యే పథకాలను మాత్రమే ప్రకటించి ప్రజల ఆదరణను చూరగొన్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన వాగ్ధాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చెప్పినట్లుగానే పెన్షన్లను పెంచి ప్రతి నెల ఒకటో తేదీన అందజేస్తున్నారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి కూడా శ్రీకారం చుట్టారు. నేడో రేపో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే విషయం పై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉన్నా దానిని గాడిన పడేయాలంటే సీఎం చంద్రబాబు చేపడుతున్న కార్యచరణను చూసి మిగతా నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Himachal is bankrupt what about our telugu states
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com