Rajadhani Files: వైసీపీకి మరో ఝలక్ తగిలింది. రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా రాజధాని ఫైల్స్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాల మేరకు సినిమా ప్రదర్శనను ఎక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ తో పాటు జగన్ ను అప్రతిష్టపాలు చేయడానికి ఈ సినిమాను తీశారంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రికార్డులు పరిశీలించనున్నందున శుక్రవారం వరకు సినిమా ప్రదర్శన నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
వైసీపీ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయం, అమరావతి రైతుల పోరాటాన్ని ఇతివృత్తంగా చేసుకుని రాజధాని ఫైల్స్ సినిమాను రూపొందించారు. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే వైసీపీ సర్కార్ కు, జగన్ కు వ్యతిరేకంగా సినిమాను తీశారని వైసీపీ నేతలు భావించారు. జగన్ ప్రతిష్టను మసకబార్చే విధంగా ఈ సినిమాను రూపొందించారని.. రాజకీయ దురుద్దేశంతో చిత్రీకరించారని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ సినిమాకు సంబంధించిన రికార్డులను అందించాలని.. అందుకే శుక్రవారం వరకు సినిమాను వాయిదా వేయాలని నిన్న ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పటికే సినిమా ప్రదర్శన ప్రారంభమైంది. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఎక్కడికక్కడే పోలీసులు రంగంలోకి దిగారు. సినిమా ప్రదర్శనను నిలిపివేశారు.
అయితే ఈరోజు అన్ని రికార్డులను పరిశీలించిన హైకోర్టు సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను న్యాయమూర్తులు పరిశీలించారు. నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించారు. అందుకే సినిమా ప్రదర్శన పై స్టే కొనసాగించేందుకు హైకోర్టు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీంతో చిత్ర ప్రదర్శనకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. దీంతో శుక్రవారం ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో సినిమా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. హైకోర్టులో సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో అమరావతి రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని విషయంలో ఇలాగే తమకు న్యాయం జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.