Ambati Rambabu : ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ మన ఏపీ మంత్రివర్యులు అంబటి రాంబాబు బాగోతాన్ని ఆయన నియోజకవర్గమైన సత్తెనపల్లిలోనే బయటపెట్టారు. ఓ బిడ్డను ప్రమాదంలో కోల్పోయిన తల్లికి వచ్చిన పరిహారంలో సగం డిమాండ్ చేశారని స్వయంగా బాధితులే బయటకు వచ్చి అంబటి దోపిడీ వ్యవహారాన్ని కళ్లకు కట్టారు. ఆ వివాదం సమసిపోకముందే మరోసారి కక్కుర్తి పడి అడ్డంగా కేసుల పాలయ్యారు మంత్రి అంబటి.

సత్తెనపల్లిలో వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో చట్టవిరుద్ధమైన స్కీమ్ ను ఇటీవల ప్రారంభించారు. వాలంటీర్లను వాడుకొని ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందే వారితో బలవంతంగా ఈ టికెట్లు అమ్మించారట.. డబ్బులు వసూలు చేశారట.. ఈ స్కీమ్ పూర్తిగా మంత్రి అంబటి రాంబాబు కనుసన్నల్లో జరిగినట్టు సమాచారం.
జనవరి 12వ తేదీన డ్రా నిర్వహించి విజేతలకు డైమండ్ నక్లెస్, రెండు కార్లు, ఒక ట్రాక్టర్, నాలుగు బుల్లెట్లు, ఆరు మోటార్ సైకిళ్లు, 13 ఎల్.ఈడీలు, 75 మిక్సీలు అందిస్తామని ప్రకటించారు. ఒక్కో కూపర్ ధరను రూ.100గా నిర్ణయించారు. నియోజకవర్గ స్థాయిలో రూ.కోటి లక్కీ డ్రా ద్వారా వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట..
ఈ మేరకు మంత్రి అంబటి రాంబాబు వాలంటీర్లు, వైసీపీ క్యాడర్ కు పుస్తకాలు అందించారు. ఎవరి స్థాయిలో వారు తమ కింది వారిని బెదిరించి కూపన్లు అంటకట్టారు. దీంతో జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినా మంత్రి అంబటిపై కేసు నమోదుకు వెనుకాడారు.
దీంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోర్టు పిల్ దాఖలు చేశారు. గాదె వెంకటేశ్వరరావు పిల్ ను మంగళవారం జిల్లా కోర్టును విచారించారు. మంత్రి రాంబాబుపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు అంతా వైసీపీ కనుసన్నల్లో ఉంటారు కాబట్టి.. కోర్టు ఆదేశించిందని కేసు నమోదు చేస్తారు కానీ విచారణ జరిగే అవకాశాలు మాత్రం లేవు.
ఇలా వైసీపీ మంత్రులు ప్రజలపై పడి లక్కీ డ్రాలు ఇతర పేరుతో దోపిడీ మొదలుపెట్టారని.. బలవంతపు వసూళ్లతో కోట్లకు పడగలెత్తుతున్నారని తెలుస్తోంది. వీటిని అరికట్టే నాథుడే లేకుండా పోతున్నారు. జనసైనికులు దీనిపై పోరుబాటు పడుతున్నారు.