
తెలంగాణలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు 12 ప్రైవేట్ ల్యాబ్ లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇటీవల ఆ 12 ల్యాబ్ లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అందుకు నిరాకరిస్తూ ఆరోగ్య శాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. అయితే, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అనుమతించిన ప్రైవేటు ల్యాబ్‌లలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయడానికి, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందించడానికి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన గాంధీ లేదా మరో ఆస్పత్రిలోనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఒత్తిడి చేయకూడదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కరోనా నిర్ధారణ పరీక్షలకు, చికిత్సకు అయ్యే ఖర్చును భరించే స్తోమత ఉన్నవారు ప్రైవేటు సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది. కాకపోతే ఐసీఎంఆర్ ఆమోదించిన ఫీజులే వసూలు చేయాలని ఆయా ఆస్పత్రులు, ల్యాబ్ లను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ లక్ష్మణ్ లతో కూడిన ధర్మాసనం నిన్న ఆదేశాలిచ్చింది.
ఇదిలా ఉండగా, తెలంగాణలో ఎన్ని కరోనా టెస్టులు చేశారన్న వివరాలు లేవని కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా కరోనా నిర్ధారణ పరీక్షల కోసం తెలంగాణలో ప్రైవేటు ల్యాబ్ లను ఉపయోగించుకోకపోవడాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూదన్ తప్పుపట్టారు. ప్రైవేట్ ల్యాబ్ లను అనుమతించకపోవడం వల్లే తెలంగాణలో ఎక్కువ టెస్టింగ్ లు చేయలేకపోతున్నారని అన్నారు. టెస్టింగ్ లు జాతీయ సగటు కంటే తక్కువగా ఉండటానికి ఇదే ముఖ్య కారణమని తెలిపారు.