Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలక మలుపు. చంద్రబాబు రిమాండ్, బెయిల్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబుకు రెండోసారి విధించిన రిమాండ్ గడువు ఈరోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును వర్చువల్ విధానంలో హాజరపరచడానికి సిఐడి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మరోసారి చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తారా? లేకపోతే బెయిల్ ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే బెయిల్ పై నిన్న కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఇవాల్టికి రిజర్వ్ చేశారు. నేటితో రిమాండ్ ముగుస్తుండటంతో బెయిలా? మళ్లీ జైలా? అన్నది తేలిపోనుంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 10న సిఐడి అరెస్టు చేసింది. కోర్టులో హాజరు పరిచింది. కోర్టు రిమాండ్ విధించింది. గతంలో ఒకసారి రిమాండ్ ముగిసిన తర్వాత.. రెండు రోజులపాటు సిఐడి కస్టడీకి ఇచ్చింది. ఇప్పుడు గురువారం నాటికి రెండోసారి రిమాండ్ గడువు ముగియడంతో నేడు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. వర్చువల్ విధానంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే చంద్రబాబు విచారణకు హాజరుకానున్నారు. తొలి విడత రిమాండ్ పూర్తయిన తర్వాత ఇదే మాదిరిగా చంద్రబాబును కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఆ సమయంలో రిమాండ్ లో ఇబ్బందులు ఉన్నాయా అని న్యాయమూర్తి చంద్రబాబును ప్రశ్నించారు. తనకు సంబంధం లేని కేసులు అక్రమంగా అరెస్టు చేశారని చంద్రబాబు అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు వినతిని ఆమోదించి బెయిల్ మంజూరు చేస్తారో? లేకుంటే రిమాండ్ ను పొడిగిస్తారు అన్నది చూడాల్సి ఉంది.
మరోవైపు ఏసీబీ కోర్టులో నిన్ననే బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని.. కస్టడీకి అనుమతించాలంటూ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఆయనకు 17a సెక్షన్ వర్తించదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ విదేశాలకు హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబుతో ఆర్థిక లావాదేవీలు జరపడంతోనే వారు విదేశాలకు పారిపోయారని.. ఇప్పుడు చంద్రబాబును విడిచిపెడితే కేసు పై ప్రభావం చూపే అవకాశం ఉందని వాదించారు. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై తీర్పును ఈరోజుకు కోర్టు రిజర్వ్ చేసింది.
ఒకవైపు చంద్రబాబు రిమాండ్ ముగియడం, మరోవైపు బెయిల్ పై తీర్పు ఇవ్వనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈనెల తొమ్మిదిన అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. సాధారణంగా పైకోర్టులో కేసు పెండింగ్లో ఉంటే.. జోక్యం చేసుకునేందుకు కింది కోర్టులు సాహసించవు. ఈ తరుణంలో చంద్రబాబు రిమాండ్, బెయిల్ పై ఏసీబీ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.