Chandrababu Health: చంద్రబాబు ఆరోగ్యం పై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. డిహైడ్రేషన్ తో పాటు చర్మ సంబంధిత వ్యాధులకు గురైన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గత 32 రోజుల నుంచి చంద్రబాబు ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఎండ వేడితో బడలికతో బాధపడుతున్నారు. డిహైడ్రేషన్ కు గురయ్యారు. శరీరమంతా దద్దుర్లు వచ్చాయి. ఇదే విషయాన్ని చంద్రబాబు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన జైలు అధికారులు రాజమండ్రి జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ సూర్య ప్రభ కి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఆమె ఇద్దరు చర్మ సంబంధిత వ్యాధి నిపుణులను కేటాయించారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి. సూర్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ సునీతా దేవి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. అందుకు సంబంధించి మందులు అందజేశారు.
చంద్రబాబు అనారోగ్యానికి గురయ్యారని తెలుసుకున్న టిడిపి శ్రేణులు ఆందోళన చెందాయి. కుటుంబ సభ్యుల సైతం భయాందోళన గురయ్యారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. బీపీ, టెంపరేచర్ నార్మల్ గా ఉందని.. పల్స్ రేట్ నిమిషానికి 87 గా ఉందని.. ఊపిరితిత్తుల్లో ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యం పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. చంద్రబాబుకు జైలులో జరగడానికి జరిగితే అందుకు సీఎం జగనే బాధ్యత వహించాల్సి ఉంటుందని టిడిపి నాయకులు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుతున్నారు.