Vyooham Movie Trailer : కారణం తెలియదు కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వైఎస్ జగన్ అంటే ఎంతో అభిమానం. అదే సమయంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటే గిట్టదు. వీరిద్దరిపై వర్మ తన మార్క్ వివాదాస్పద చిత్రాలు చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబు వెన్నుపోటు దారుడని చెప్పే ప్రయత్నం చేశాడు. 1995 నాటి ఆగస్టు సంక్షోభం ప్రధానంగా లక్ష్మీ ఎన్టీఆర్ తెరకెక్కింది. 2019 ఎన్నికల్లో జనసేన ఘోర ఓటమి చవి చూడగా… ఈ సంఘటనల సమాహారంగా పవర్ స్టార్ టైటిల్ తో ఒక చిత్రం చేశాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్, పవర్ స్టార్ చిత్రాలు టీడీపీ, జనసేన వర్గాలను ఆగ్రహానికి గురి చేశాయి. ఇదే తరహా కాంట్రవర్సియల్ సినిమా వ్యూహం. సీఎం జగన్ కి మద్దతుగా వ్యూహం సినిమాను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. వ్యూహం అందరికీ తెలిసిన కథే. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం, సంఘటనల సమాచారం.
కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేకించిన జగన్ ఓదార్పు యాత్ర మొదలుపెట్టాడు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక కన్నుమూసిన అభిమానులను ఓదార్చేందుకు యాత్ర చేశాడు. ఆ యాత్ర ఆపేయాలంటూ జగన్ ని ఢిల్లీ పెద్దలు ఆదేశించారు. అయినా జగన్ యాత్ర ఆపలేదు. అనంతరం జగన్ పై సీబీఐ దాడులు, విచారణలు, కేసులు, అరెస్టులు చోటు చేసుకున్నాయి. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశాడు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఇక వ్యూహం ట్రైలర్ లో ఇవే అంశాలు చూపించారు. అయితే జగన్ అరెస్ట్ వెనుక చంద్రబాబు ఉన్నట్లుగా కూడా చెప్పారు. 2019లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్నది ఎవరు? వంటి విషయాలతో సాగింది. జనసేన మీద కూడా చంద్రబాబు కుట్ర చేసినట్లు ట్రైలర్ లో చెప్పారు.
చివర్లోనే వర్మ ట్విస్ట్ ఇచ్చాడు. జగన్ సీఎం అయ్యాక చంద్రబాబు హయాంలో జరిగిన ‘స్కిల్ డెవలప్ మెంట్ ’ లేటెస్ట్ స్కాంను ఎలా బయటకు తీశాడన్నది వర్మ ఆసక్తిగా చివర్లో బయటపెట్టాడు. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది. చంద్రబాబు అరెస్ట్ వెనుక ఏం జరిగిందన్నది ఆసక్తి రేపుతోంది.
రంగం ఫేమ్ అజ్మల్ అమీర్ జగన్ రోల్ చేయగా, ఆయన భార్య పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించడం జరిగింది. నవంబర్ 10న వ్యూహం విడుదల కానుంది. శబధం అని మరో పార్ట్ ఉన్నట్లు వర్మ ప్రకటించారు.