KCR: సిరిసిల్ల గడ్డ మీద కేటీఆర్‌కు తిరుగులేదు. ఈ విషయం చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కేటీఆర్ పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో మెజార్టీ పెంచుకూంటూ గెలుస్తున్నారు. ఒక్క సారి కూడా ఓటమి పాలు కాలేదు. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ఆయన సిరిసిల్లలోని ప్రతి ఊరులో తన పట్టును పెంచుకుంటూ ప్రతిపక్షాలను దరిదాపుల్లో లేకుండా చూసుకున్నారు. తండ్రి నుంచి వచ్చిన వాగ్ధాటి, వ్యూహరచనలతో ఆయన దూసుకుపోతున్నారు.
కేటీఆర్‌ను సిరిసిల్లలో 2009 ఉప ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయించారు కేసీఆర్. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం బలంగా నడుస్తోంది. అప్పుడు ఆత్మగౌరవం పేరిట కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. అలా చేసిన వారిలో సిరిసిల్ల నుంచి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే కేకే మహేందర్‌రెడ్డి కూడా ఉన్నారు. ఆయన మొదటిసారి గెలిచారు. నియోజకవర్గం మీద మంచి పట్టు కూడా ఉంది.
కానీ ఇక్కడే కేసీఆర్ తన మార్కుచూపించారు. ఈ ఉప ఎన్నికల్లో మరోసారి టీఆర్ ఎస్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పైగా కేకే మహేందర్ వ్యక్తిగత ఇమేజ్‌కంటే కూడా సిరిసిల్లలో పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంది. దాంతో తన కొడుకు కేటీఆర్‌ను రంగంలోకి దింపి.. టీడీపీతో పొత్తు పెట్టుకుని మరీ తన కొడుకును గెలిపించుకున్నారు.
కానీ కేటీఆర్ తన తండ్రి చూపించిన దారిలో అంచెలంచెలుగా ఎదిగారు. సిరిసిల్లలో పట్టు పెంచుకున్నారు. పల్లె పల్లె తిరుగుతూ ఇప్పుడు తిరుగులేని నేతగా ఎదిగారు. వరుసగా 2014, 2018 ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. 2009 ఉప ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయనే సిరిసిల్లలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. కేకే తర్వాత అంత పెద్ద లీడర్ లేకపోవడంతో కాంగ్రెస్ ఆయన్నే నమ్ముకుంటోంది.
కానీ కేటీఆర్ ప్రతి ఎన్నికలో అంతకంతకు మెజార్టీని పెంచుకుంటూ హ్యాట్రిక్ కొట్టారు. ఇక చివరిసారి జరిగిన ఎన్నికల్లో 80వేలకు పైగా భారీ మెజార్టీతో గెలిచారు. ఇక కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న కొండూరి రవీందర్‌రెడ్డిని టీఆర్ ఎస్‌లోకి తీసుకుని ఆయనకు కీలక పదవి ఇచ్చేశారు. దీంతో ఆయన సైలెంట్ అయిపోయారు.
మహేందర్‌రెడ్డి పెద్దగా యాక్టివ్ రాజకీయాల్లో ఉండరు. కేవలం ఎన్నికలు వచ్చిన సమయంలోనే బయట కనిపిస్తారు తప్ప.. మిగతా సమయాల్లో మండలాలు, గ్రామాల్లో పర్యటించరు. ప్రజా సమస్యలపై పోరాడిన దాఖలాలు కూడా పెద్దగా లేవు. దీంతో చాలా గ్రామాల్లో ఆయన పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. ఇక బీజేపీకి ఇక్కడ చెప్పుకోదగ్గ లీడర్ లేడు. బండి సంజయ్ ఎంపీ అయిన తర్వాత ఇప్పుడిప్పుడే కేడర్ ఏర్పడుతోంది.
కానీ కేటీఆర్ మీద పోటీ చేయగలిగేంత పెద్ద లీడర్ అయితే బీజేపీలో లేడు. అందుకే వచ్చే 2023 ఎన్నికల్లో కేకే మహేందర్‌రెడ్డిని బీజేపీ తరఫున పోటీ చేయించాలని సంజయ్ ప్లాన్ చేస్తున్నారు. మహేందర్‌రెడ్డి ఇమేజ్, పార్టీ కేడర్ కలిస్తే బలమైన పోటీ ఇవ్వొచ్చనేది వారి వ్యూహం. కానీ మహేందర్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డికి నమ్మకస్తుడిగా ఉన్నారు.
గత 2018 ఎన్నికల్లో మహేందర్ రెడ్డి తరఫున సిరిసిల్లలో రేవంత్ ప్రచారం కూడా నిర్వహించారు. అప్పటి నుంచే రేవంత్‌కు నమ్మిన బంటుగా మెలుగుతున్నారు. ఇప్పుడు రేవంత్ టీపీసీసీ చీఫ్ కావడంతో.. ఆయన మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. అందుకే కాంగ్రెస్‌ను వీడేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు.
ఒకవేళ ఆయనకు పెద్ద ఆఫర్ ఇచ్చి బీజేపీలో చేర్చుకున్నా.. కేటీఆర్‌కు బలమైన పోటీ ఇస్తారా అంటే అనుమానమే. ఎందుకంటే సిరిసిల్లలోని ప్రతి ఊర్లో టీఆర్ ఎస్ బలంగా ఉంది. పైగా కేటీఆర్ ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మరీ అభివృద్ధి పనులు చేయించుకుంటున్నారు. అందుకే ఆయన నిమ్మలంగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు.
Also Read: మాకేం తక్కువ.. బావలకు మందుబాటిళ్లు పెడుతున్న బామ్మర్దులు.. ఇదేం ట్రెండ్ రా నాయనా..
సిరిసిల్లలోని బలమైన వర్గం అయిన నేతన్నలు మొదటి నుంచి టీఆర్ ఎస్‌లోనే ఉన్నారు. ఇక వారితో పాటు రైతులు, పింఛన్ దారులు, మహిళలు, కొన్ని బలమైన సామాజిక వర్గాలు మొత్తం కేటీఆర్ వైపే ఉన్నారు. పార్టీకి అతీతంగా కేటీఆర్‌ను వ్యక్తిగతంగా అభిమానించే వారు కూడా చాలామందే ఉన్నారు. అదే ఆయనకు అతిపెద్ద బలం.
బీజేపీకి ఈ వర్గాల్లో పెద్దగా పట్టు లేదు. కేవలం యూత్ లో మాత్రమే ఒకింత అభిమానం ఉంది. ఇప్పుడు వేసిన నోటిఫికేషన్ల దెబ్బకు వారు కూడా గ్యాప్ పాటిస్తున్నారు. అందరూ ప్రిపరేషన్ లో మునిగిపోయారు. కేకే మహేందర్ రెడ్డికి ఒకప్పుడు నియోజకవర్గంలో ఉన్నంత పట్టు ఇప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు కేటీఆర్‌ను దెబ్బ కొట్టాలని బీజేపీ ఎంత పెద్ద ప్లాన్ వేసినా.. ఇప్పటికప్పుడు మాత్రం పెద్దగా ప్రభావం చూపించే ఆస్కారం లేదు.
Also Read: ‘రియల్’ స్టోరీ: కేసీఆర్ ఎత్తేసే ‘111 జీవో’ వెనుక అసలు కథ.. లక్షల కోట్ల విలువైన భూమి!