YSRCP: వైసిపి వ్యూహాలు విఫలమవుతున్నాయా? ప్రశాంత్ కిషోర్ తరహాలో వ్యూహాలు అమలు కావడం లేదా? ఇప్పుడు అభ్యర్థుల మార్పు తప్పుడు నిర్ణయమా? ఇది చేటు తెస్తుందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించారు. జగన్ కు అంతులేని మెజారిటీ అందించగలిగారు. ఏపీ ప్రజలను వర్గాలుగా విభజించి జగన్ వైపు టర్న్ చేయడంలో పీకే వ్యూహాలు ఫలించాయి. అటువంటి పీకే లేని స్ట్రాటజీలు ఫెయిల్ అవుతున్నాయి. వైసీపీ నేతలను వణికిస్తున్నాయి.
ప్రస్తుతం వైసీపీకి ఐప్యాక్ సేవలందిస్తోంది. పూర్వాశ్రమంలో ఐపాక్ ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో నడిచేది. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఐపాక్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. బిహార్ లో సొంత పార్టీ పెట్టుకుని రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఆయనకు అంతగా కలిసి వచ్చేలా పరిస్థితులు లేవు. అలాగని తిరిగి వ్యూహకర్తగా చేరే ఉద్దేశం లేదు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభ్యర్థుల మార్పు వెనుక ఐప్యాక్ హస్తం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ మాదిరిగా గ్రౌండ్ రియాలిటీ నివేదికలు అందించడం లేదని తెలుస్తోంది. కేవలం జగన్ను సంతృప్తి పరిచేందుకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని వైసీపీ సీనియర్ నేతలే బాహటంగా చెబుతున్నారు.
ఈసారి జగన్ సొంత మనుషులు కంటే ఐప్యాక్ నివేదికలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ నేత విషయంలో ఇది స్పష్టమైంది. ఆయన విషయంలో ఐపాక్ ఇచ్చిన నివేదికనే నమ్మి జగన్ దూరం చేసుకున్నారని.. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నమ్మకస్తుడైన నాయకుడిని వదులుకోవాల్సి వచ్చిందని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. ఐ ప్యాక్ నివేదికలను నమ్మితే జగన్ రాజకీయంగా నష్టపోవడం ఖాయమని పార్టీలో కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కేవలం రాజకీయ అంశాలకే ఐపాక్ పరిమితమైతే బాగుండేది. కానీ పాలనలోనూ, ప్రభుత్వంలోనూ ప్రవేశిస్తుండడం ఇబ్బందికరంగా మారుతోంది. చివరికి ఎక్కడ రోడ్లు వేయాలన్నా.. ఐ ప్యాక్ అనుమతి కావాల్సిందేనన్న స్థితికి చేరుకుంది. ఎక్కడ రాజకీయంగా అక్కరకు వస్తుందో…ఆ ప్రాంతంలోనే రోడ్లు వేయాలని ఐపాక్ సిఫారసు చేస్తుండడం విశేషం. ప్రస్తుతం నియోజకవర్గాలు సైతం ఐప్యాక్ కను సన్నల్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రస్థాయి ప్రచార కార్యక్రమాలు సైతం ఆ బృందమే రూపొందిస్తోంది. అయితే ఇప్పటివరకు ఆ టీం చేపట్టిన కార్యక్రమాలు ఏవి సక్సెస్ కాకపోవడం విశేషం. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఐపాక్ టీం రూపొందించింది. ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాతే ఎక్కడికక్కడే ప్రజలు నిలదీశారు. ప్రశ్నల వర్షం కురిపించారు. జగనన్నకు చెబుతాం కార్యక్రమం కూడా ఫీల్ కావడానికి ఐప్యాక్ వ్యవహరించిన తీరే కారణమని తెలుస్తోంది.
వాస్తవానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమితోనే.. అధికార పార్టీ హవాకు చెక్ పడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మూడింటిని వైసీపీ కైవసం చేసుకుంటుందని ఐపాక్ నివేదించింది. కానీ మూడు చోట్ల ఓటమి ఎదురైంది. అప్పటి నుంచే తప్పుడు నివేదికలు ఇచ్చే ఐ ప్యాక్ టీం పై వైసీపీలో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది. కానీ అధినేత జగన్ మాత్రం ఆ బృందాన్ని బలంగా నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఐ ప్యాక్ టీం ద్వారా జరిపించాలని చూస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాహటంగానే ఐపాక్ టీం పై తిరుగుబాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.