Nara Lokesh
Nara Lokesh: నారా లోకేష్ పరిణితి చెందారా? పాదయాత్రతో నాయకత్వాన్ని పటిష్టరుచుకున్నారా? టిడిపికి మూడో తరం నాయకుడు దొరికాడని కేడర్ భావిస్తోందా? చంద్రబాబు తరువాత పార్టీని లీడ్ చేయగలడా? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో నారా లోకేష్ పై జరుగుతున్న చర్చ ఇది. 2014 ఎన్నికల తర్వాత రాజకీయ అరంగేట్రం చేసిన లోకేష్ తొలుత ఎమ్మెల్సీ అయ్యారు. తరువాత మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలో దిగి ఓటమి చవిచూశారు. ప్రస్తుతం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్ర చేస్తున్నారు. దాదాపు ఏడు నెలల్లో 2500 కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేశారు.
పాదయాత్ర అనుకున్న స్థాయిలో సక్సెస్ జరగడం లేదన్న టాక్ ఉంది. అయితే టిడిపి శ్రేణులు మాత్రం ఒక రకమైన ఆలోచనతో ఉన్నాయి. చంద్రబాబు తర్వాత తమకు ఒక నాయకుడు దొరికాడని భావిస్తున్నాయి. నిజానికి పాదయాత్రకు ముందు లోకేష్ లో మైనస్ లే అధికం. వాటన్నింటినీ ఎలా అధిగమిస్తారా అన్న ఆందోళన క్యాడర్ లో ఉండేది. ముఖ్యంగా లోకేష్ కు మాస్ ఇమేజ్ లేదు. నాయకత్వ లక్షణాలు లేవు. అధికారంలో ఉండి.. సిట్టింగ్ మంత్రి అయి ఉండి.. సీఎం తనయుడు అయి ఉండి గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. దీంతో ఆయన ఒక నాయకుడే కాదన్న రేంజ్ లో విపక్షం ప్రచారం చేసింది. ఈ తరుణంలో పాదయాత్ర చేసిన ఆయనపై ఒక టాక్ నడిచింది. అసలు లోకేష్ పాదయాత్ర చేయగలరా? మధ్యలో ఆపేస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ ఇటువంటి వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నారు లోకేష్. 185 రోజులు పాటు పాదయాత్ర చేసి తనపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేశారు.
లోకేష్ పాదయాత్ర ద్వారా ఏపీ ప్రజలకు దగ్గరయ్యారో లేదో చెప్పలేం కానీ.. టిడిపి శ్రేణులకు మాత్రం భావి నాయకుడిగా కనిపించారు. వారి బలమైన నమ్మకాన్ని పొందగలిగారు. క్షేత్రస్థాయిలో లోకేష్ పార్టీ పై పట్టు సాధించారు. రేపు టిడిపి అధికారంలోకి వస్తే.. చంద్రబాబు పట్టించుకుంటారో లేదో కానీ.. లోకేష్ తమకు అండగా నిలుస్తారని భావిస్తున్నారు.అటు పార్టీలో పనిచేస్తున్న నాయకుల వ్యవహార శైలిని సైతం తన పాదయాత్ర ద్వారా లోకేష్ స్టడీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడున్న నాయకులకు ప్రత్యామ్నాయంగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. గతంలో లోకేష్ ను తక్కువ చేసిన సీనియర్ల సైతం.. ముక్కున వేలేసుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన నాయకత్వ లక్షణాలను మరింత అభివృద్ధి చేసుకున్నారు.
ఎన్టీఆర్ తరహాలో మాస్ ఇమేజ్ కు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యారు. చంద్రబాబులో మాస్ ఇమేజ్ లేదు. వ్యూహ కర్తగాను, పాలనా దక్షుడిగాను చంద్రబాబు గుర్తింపు పొందారు. ఇప్పుడు లోకేష్ సైతం అటు వ్యూహకర్తగాను, ఇటు మాస్ ఇమేజ్ ని తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి తోడు ఆయన మాట తీరు మారింది. సమయస్ఫూర్తిగా చెబుతున్న సమాధానాలు ఆకట్టుకుంటున్నాయి. పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు వచ్చినా.. సమయస్ఫూర్తి ప్రదర్శించి ముందుకు సాగారు. ప్రసంగ శైలి కూడా గతానికి భిన్నంగా ఉంది. గతంలో మాట్లాడేందుకే ఇబ్బంది పడేవారు. ఇప్పుడు మాటల్లో రాటుదేలారు. ఇలా ఎలా చూసుకున్నా లోకేష్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా దాదాపు 1500 కిలోమీటర్లు నడవాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన నాయకత్వ లక్షణాలు మరింత మెరుగుపరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.