Kesineni Nani- Nara Lokesh
Kesineni Nani- Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో చురుగ్గా సాగుతోంది. ప్రస్తుతం విజయవాడ నగరంలో లోకేష్ నడుస్తున్నారు. కానీ ఎక్కడా విజయవాడ ఎంపీ కేశినేని నాని కనిపించకపోవడం కొత్త టాక్ ప్రారంభమైంది. సొంత పార్టీ ఎంపీ గైర్హాజరు కావడం కలకలం రేపుతోంది. అదే సమయంలో నాని సోదరుడు చిన్ని అన్నీ తానై వ్యవహరిస్తుండడంతో పెను దుమారానికి దారితీస్తోంది. అటు
కేసినేని నానికి వ్యతిరేక వర్గంగా భావించే బోండా ఉమా, బుద్దా వెంకన్నలు తెగ హడావిడి చేస్తున్నారు.
2024 ఎన్నికలు టిడిపికి ప్రతిష్టాత్మకం. ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాలో టిడిపికి ఏకపక్ష ఫలితాలు వస్తాయని హై కమాండ్ భావిస్తోంది. అటువంటి చోటే టిడిపి నాయకులు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వాటి పరిష్కారం పై నాయకత్వం ఫోకస్ పెట్టకపోవడంతో మరింత ముదురుతున్నాయి. చంద్రబాబు తర్వాత పార్టీని లీడ్ చేస్తారనుకుంటున్న లోకేష్ పాదయాత్రకు కేశినేని నాని డుమ్మా కొట్టేంతగా పరిస్థితులు మారిపోయాయి.పార్టీలో జరుగుతున్న పరిణామాలతోనే నాని పాదయాత్రకు దూరంగా ఉన్నారు. తన సోదరుడు చిన్నిని ప్రోత్సహించడం ద్వారా.. తనకు పొమ్మన లేక పొగ పెడుతున్నారు అన్న ఆవేదనతో నాని ఉన్నారు. చిన్నికి వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఖరారు చేస్తారని తెలుసుకొని నాని పార్టీకి దూరమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి గత ఎన్నికల నుంచి కేశినేని నానికి.. కృష్ణా జిల్లా టిడిపి నాయకులతో పొసగడం లేదు. మున్సిపల్ ఎన్నికలతో విభేదాలు తీవ్రమయ్యాయి. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ గా కేశినేని నాని కుమార్తె శ్వేతను నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో సొంత పార్టీ వారే వెన్నుపోటు పొడిచారని కేశినేని నాని హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. కానీ సదరు నాయకులనే నాయకత్వం ప్రోత్సహిస్తోందని నాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తనను తప్పించి.. సోదరుడు చిన్నిని తెరపైకి తేవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నిని తప్పించి ఎవరికీ టికెట్ ఇచ్చినా సహకరిస్తానని కేసినేని నాని ప్రకటించిన సంగతి తెలిసింది.
అయితే గత కొంతకాలంగా కేశినేని నాని వైసీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. అయితే అది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది. ఆ మధ్యన ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. కేశినేని నాని పార్టీలో చేరుతామంటే సాదరంగా ఆహ్వానిస్తామని ప్రకటించారు. అప్పట్నుంచి టిడిపి నాయకత్వం కేశినేని నాని విషయములో ఒక రకమైన అభిప్రాయంతో ఉంటూ వస్తోంది. ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు కేశినేని నాని దూరంగా ఉండడంతో.. ఎన్నికల ముంగిట ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.