India Rice Export Ban 2023: ఆమధ్య బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. చెప్పినట్టుగానే బియ్యం ఎగుమతులు నిలిచిపోవడంతో అమెరికా నుంచి మొదలుపెడితే ఆఫ్రికా వరకు అన్ని దేశాల్లో ఆర్తనాదాలు మొదలయ్యాయి. బియ్యం నిషేధంపై మీడియా సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ సర్కులేట్ అయ్యాయి. ఇదే సమయంలో మోడీపై విమర్శలు కూడా మొదలయ్యాయి. ముందు చూపు లేకుండా బియ్యంపై నిషేధం విధించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కానీ బియ్యం పై ఎందుకు నిషేధం విధించాల్సి వచ్చిందో ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థం కాదు.
వాతావరణంలో మార్పుల వల్ల పంట ఉత్పత్తులు అనుకున్నంత స్థాయిలో ఉండటం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న దేశం కాబట్టి ఆహార సంక్షోభం ఏర్పడితే.. దానిని మరొక దేశం భర్త చేసే అవకాశం లేదు. పైగా ధరల స్థాయి నిరంతరం పెరుగుతుండడంతో అది ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. అంతిమంగా ఇది ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేస్తోంది. ఈక్రమంలోనే భారత్ బియ్యం పై నిషేధం విధించింది. అదే సమయంలో బియ్యం, గోధుమలపై కిలో ధర రెండు రూపాయలు తగ్గించింది. టోకు వ్యాపారులకు 50 లక్షల టన్నుల బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఓఎంఎస్ఎస్ కింద కిలో బియ్యం రిజర్వు ధర 29 రూపాయలుగా నిర్ణయించింది. దీనివల్ల ధరలు తగ్గుతాయని కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.
ఎగుమతులను ఆసరాగా చేసుకుని వ్యాపారులు అమాంతం ధరలు పెంచేస్తున్నారు. దీనివల్ల ధరల స్థాయి పెరిగి అది కృత్రిమ ఆహార సంక్షోభానికి కారణమవుతోంది. ఈ విషయం కేంద్రం దృష్టికి రావడంతో రెండో మాటకు తావు లేకుండా అది బియ్యం పై నిషేధం విధించింది. దీనివల్ల వ్యాపారులు ధరలను తగ్గించేందుకు అనివార్య పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో ప్రస్తుతం రెండు రూపాయల వరకు ధర తగ్గింది. భవిష్యత్తు రోజుల్లోనూ ధరలు తగ్గుతాయని కేంద్ర పౌరసరఫరాల శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే బియ్యం, గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. ఈ జాబితాలోకి చక్కెరను కూడా చేర్చినట్టు తెలుస్తోంది. ముందుగా దేశీయ అవసరాలు తీరిన తర్వాతే ఎగుమతులు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంలో మోడీ ప్లాన్ వర్కౌట్ అయినట్టు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.