
Jagan – BJP : కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నాడా.. వివేకా హత్యకేసు నుంచి తప్పించడానికి కర్ణాటక ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించే బాధ్యతను తీసుకున్నాడా అంటే అవుననే సమాధానం వస్తోంది పొలిటికల్ సర్కిల్స్ నుంచి. జగన్ 2019 ఎన్నికల ముందు వరకు బీజేపీ, కాంగ్రెస్‌కు సమాన దూరం పాటించాడు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే కేంద్రంలో మాత్రం జగన్ ఆశించిన రిజల్ట్ రాలేదు. కేంద్రంలో హంగ్ వస్తుందని జగన్ భావించారు. అప్పుడు తమ పార్టీ అవసరం ఉంటుందని లెక్కలు వేసుకున్నాడు. హంగ్ ఏర్పడితే తనపై ఉన్న కేసుల మాఫీ కోసం డీల్ కుదుర్చుకోవచ్చని భావించారు. కానీ ఎవరి అంచనాలకు అందని విధంగా బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. దీంతో జగన్ ఆశలు అడియాసలయ్యాయి. అప్పటి నుంచి బీజేపీతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు.
తరచూ ఢిల్లీకి..
అధికారంలోకి రాకముందు.. కేంద్రం మెడలు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్.. 2019 ఎన్నిల రిజల్ట్ చూసి షాక్ అయ్యారు. కేంద్రం మెడలు వచ్చే ప్రయత్నాలు చేయకుండా.. తరచూ ఆయనే ఢిల్లీకి వెళ్తూ.. కేంద్ర మంత్రుల మందు మెడలు వంచి దండాలు పెడుతున్నాడు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు సీఎంవో నుంచి ప్రకటన విడుదల చేయిస్తున్నా.. సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారన్న ఆరోపణలు మాత్రం ఉన్నాయి. అక్రమాస్తుల కేసుతోపాటు ఎన్నికలకు ముందు జరిగిన బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి బయట పడేందుకే జగన్ తరచూ ఢిల్లీ వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతుంది.
బీజేపీ ఆదేశాల మేరకు రాజ్యసభ టికెట్..
ఏరకంగా చూసినా కేంద్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకునే అవకాశం లేకపోవడంతో జగన్.. కేంద్రంలోని బీజేపీకి పూర్తిగా బెండ్ అయ్యారు. ప్రధాని మోదీ సూచన మేరకు జగన్ తన శత్రువుగా భావించిన అంబానీ సహచరుడు పరిమల్ నత్వానీకి వైసీపీ నుంచి రాజ్యసభకు పంపారంటేనే జగన్ ఎంతలా కేంద్రం ముందు మోకరిళ్లుతున్నారో అర్థమవుతోంది. తర్వాత గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్త గౌతం అదానీ భార్య ప్రతీ అదానికి కూడా రాజ్యసభ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఇది కూడా ప్రధాని మోదీ సూచన మేరకు జగన్ అంగీకరించినట్లు అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ చివరి నిమిషయంలో అదాని వాటిని ఖండించారు. తమకు రాజకీయాలపై ఆసక్తి లేదని, రాజకీయాల్లోలకి రావడం లేదని ప్రకటించి ప్రచారానికి తెర దించారు.
తాజాగా కేసుల ఎత్తివేతకు డీల్?
తాజాగా జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీ కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కీలక రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీపీఐ నారాయణ ఆరోపించడం ఏపీ రాజకీయాల్లో సంచలనమైంది. వివేకా హత్యకేసు జగన్‌ను చుట్టముడుతుండడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురు దెబ్బలు తగలడం, 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతుండడంతో జగన్ అమిత్‌షా శరణు కోరాడని నారాయణ ఆరోపించారు. ఈ క్రమంలో త్వరలో జరుగనున్న కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని రెండోసారి అధికారంలోకి తెచ్చే బాధ్యతను అమిత్‌షా జగన్‌కు అప్పగించినట్లు ఆయన అన్నారు.. ఫలితంగా వివేకా హత్య కేసుతోపాటు, గతంలో ఉన్న అక్రమార్చన కేసులు కూడా ఎత్తివేసేలా డీల్ కుదిరినట్లు సంచలన ఆరోపణలు చేశారు. మరి వీటిలో నిజమెంత? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
100 సీట్లకు పెట్టుబడి..
అమిత్‌షాతో కుదిరిన డీల్ ప్రకారం.. ఏపీ సీఎం జగన్ కర్ణాటక ఎన్నికల్లో వంద మంది అభ్యర్థుల ఖర్చును భరించాల్సి ఉంటుందని నారాయణ ఆరోపించారు. వారి గెలుపు బాధ్యత కూడా జగన్ తన భుజాలపైనే వేసుకున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఈనెలలో 15 రోజుల వ్యవధిలోనే జగన్ రెండుసార్లు ఢిల్లీ వెళ్లారని విపక్ష నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ‘కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నాడు. వివేకా హత్యకేసు నుంచి తప్పించడానికి కర్ణాటక ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించాలి. జగన్ సంపాదించిన అక్రమ ఆస్తులను కర్ణాటక ఎన్నికల్లో ఖర్చు చేయబోతున్నాడు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ‘బీజేపీతో జగన్ చేసుకున్న ఒప్పందంతో వివేకా హత్యకేసు తీర్పు ఆలస్యం కాబోతుంది. ఆదానీ కేసు తరహాలోనే వివేకా హత్యకేసు కూడా కొలిక్కివచ్చే సమయంలో కేంద్రం సుప్రీం కోర్టు ద్వారా కమిటీ వేయించింది. జగన్ పదేపదే ఢిల్లీకి ఎందుకు పరుగులు పెడుతున్నారనేది బట్టబయలైంది. వివేకా హత్యకేసు విచారణ సుప్రీం కోర్టులో చివరిదశకు రావడంతో భయంతోనే డిల్లీకి వెళ్లాడు. కేంద్రాన్ని నిలదీసే శక్తి లేని జగన్ రాష్ట్రాన్ని శ్మశానంలా మారుస్తున్నాడు’ అని నారాయణ మండిపడ్డారు.
మరి బీజేపీతో జగన్ డీల్ నిజమేనా.. కర్ణాటకలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందా.. అనేది వేదిచూడాలి.