Balka Suman: బాల్క సుమన్‌లో భయం మొదలైందా..?

ఇప్పుడు ప్రజల టైం వచ్చింది... అరాచక ఎమ్మెల్యేను ఓడించాలని నియోజకవర్గ ప్రజలు పార్టీలకు అతీతంగా సిద్ధమయ్యారు. ఈ సమయంలో బాల్క సుమన్‌ను ఢీకొట్టే బలమైన నేత కోసం ఎదురు చూస్తుంగా.. వారికి ఆశా దీపంలా మారాడు వివేక్‌ వెంకటస్వామి.

Written By: Raj Shekar, Updated On : November 16, 2023 4:38 pm

Balka Suman

Follow us on

Balka Suman: బాల్క సుమన్‌.. ఉస్మానియా విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి అగుడు పెట్టాడు. ఎప్పుడు చూసినా అగ్రెసివ్‌గా.. విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌ దీవెనులు ఫుల్లుగా ఉన్న సుమన్‌.. తాను ఏం చేసినా చెల్లుతుంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పెద్దపెల్లి ఎంపీగా 2014లో టీఆర్‌ఎస్‌ గాలిలో గెలిచిన సుమన్, 2018లో చెన్నూర్‌ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఐదేళ్లలో తన అరాచకాలతో ప్రతిపక్షాలు, ప్రజలను ముప్పు తిప్పలు పెట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజల భూములు లాక్కోవడం, కబ్జాలు చేయడం, చేసినవారిని కాపాడడం, ఇసుక దందా, కాళేశ్వరం ముంపు బాధితులను పట్టించుకోకపోవడం, న్యాయం చేయాలని అడిగిన వారిపై కేసులు పెట్టించడం, పోలీసుల అండతో అరాచకాలు చేయడం నియోజకవర్గంలో పరిపాటుగా మారింది. దీంతో చాలా మంది బాధితులు ఎమ్మెల్యే వేధింపులు తాళలేక మౌనంగా ఉండిపోయారు. అరాచకాలను భరిస్తూ వచ్చారు.

ఇప్పుడు వాళ్ల టైం..
ఇప్పుడు ప్రజల టైం వచ్చింది… అరాచక ఎమ్మెల్యేను ఓడించాలని నియోజకవర్గ ప్రజలు పార్టీలకు అతీతంగా సిద్ధమయ్యారు. ఈ సమయంలో బాల్క సుమన్‌ను ఢీకొట్టే బలమైన నేత కోసం ఎదురు చూస్తుంగా.. వారికి ఆశా దీపంలా మారాడు వివేక్‌ వెంకటస్వామి. కాంగ్రెస్‌లో చేరిన వివేక్‌.. చెన్నూర్‌ టికెట్‌ సాధించారు. దీంతో అక్కడి ప్రజలకు మరింత బలం దొరికింది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఖరారు కావడమే ఆలస్యం అన్నట్లు.. బీఆర్‌ఎస్‌లోనే బాల్క సుమన్‌ బాధితులంతా కాంగ్రెస్‌లో చేరారు. ప్రజలుకూడా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. రాష్ట్ర మంతటా బీఆర్‌ఎస్‌కు మద్దతుగా సభలు పెడుతుంటే.. చెన్నూర్‌లో మాత్రం కాంగ్రెస్‌కు మద్దతుగా సభలు నిర్వహించడం అక్కడి ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమంటున్నారు విశ్లేషకులు.

కాంగ్రెస్‌ నేతలపై బూతుపురాణం..
ఈసారి ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి వస్తుందని, తన దందాలకు ఇక ఎదురే ఉండదని సుమన్‌ భావిస్తున్నారు. ఇందుకోసం రాజశ్యామల యాగం కూడా చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. మరోవైపు చెన్నూరులో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ రోజురోజుకు పెరుగుతుంది. బీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇస్తుంది. పార్టీ గ్రాఫ్‌ పడిపోతుంది. దీంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ డిఫెన్స్ లో పడ్డారు. దీంతో పోలీసుల సహకారంతో కాంగ్రెస్‌ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్‌ రోజే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆర్వో కార్యాలయం వరకు కారులో వెళ్లారు. పోలీసులు కూడా ఆయనకు వత్తాసు పలికారు. ఇక కాంగ్రెస్‌ బలం పెరుగుతుండడంతో సుమన్‌ తిట్ల దండకం అందుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరినవారిపై కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దుర్భాషలాడుతున్నారు. కేసీఆర్‌ స్వయంగా చెన్నూర్‌కు వచ్చినా ఆయనకు గెలుపుపై ఆశలు కలుగడం లేదు.

రాజధాని బాట..
అన్ని పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటే బాల్క సుమన్‌ మాత్రం హైదరాబాద్‌కు బుధవారం హుటాహుటినా వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వివేక్‌ వెంకటస్వామి డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ సీఈవో వికాస్‌ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. బ్యాంక్‌ ఖాతాలపై నిఘా పెట్టాలని రిక్వెస్ట్‌ చేశారు. అనంతరం బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడుతూ.. వివేక్‌ కంపెనీ నుంచి ఒక సూట్‌ కేసు కంపెనీకి సోమవారం 8 కోట్లు బదిలీ చేశారని, సూట్‌ కేసు కంపెనీలో ఇద్దరు డైరెక్టర్లు వివేక్‌ కంపెనీ ఉద్యోగులు ఉన్నారని వివరించారు. ఆ కంపెనీ రామగుండంలో వివేక్‌ ఇంటి చిరునామా పైనే ఉందన్నారు. ఈ కంపెనీ ఖాతాను ఫ్రీజ్‌ చేయాలని కోరినట్లు తెలిపారు. త్వరలోనే ఈడీ, ఆదాయ పన్ను శాఖలకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.

ప్రచారంలో దూసుకపోతున్న వివేక్‌..
మరోవైపు వివేక్‌ వెంకటస్వామి అందరినీ కలుపుకుపోతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వివేక్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, ఐఎన్‌టీయూసీ నాయకులు, ఇతర నాయకులు నియోజకవర్గంలో విస్తృతగా ప్రచారం చేస్తున్నారు. మార్నిగ్‌ వాకర్స్‌తో వివేక్‌ కలిసి నడుస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. వివేక సతీమణి మహిళలను కలుస్తూ కాంగ్రెస్‌ గెలిపించాలని కోరుతున్నారు. ఐఎన్‌టీయూసీ నాయకులు కాంగ్రెస్‌ గెలిస్తేనే సింగరేణికి మనుగడ ఉంటుందని కార్మిక వాడల్లో ప్రచారం చేస్తున్నారు. బాల్క సుమన్‌ దోపిడీ, అరాచకాలు, ఇసుక దందా, సింగరేణిలో రాజకీయ జోక్యం గురించి ఇంటింటా వివరిస్తున్నారు. మెడికల్‌ అన్‌ఫిట్‌కు 10 లక్షలు, బదిలీకి రూ.5 లక్షలు, ట్రాన్స్‌ఫర్‌కు రూ.50 వేలు, క్వార్టర్‌కు రూ.లక్ష తీసుకునే సంప్రదాయాన్ని తీసుకువచ్చిందే బాల్క సుమన్‌ అని వివరిస్తున్నారు.

సుమన్‌కు దీటుగా ఎన్నికల ఖర్చు..
మరోవైపు ఈసారి చెన్నూర్‌లో గెలుపు వివేక్‌కు అత్యవసరం. వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి దోహదపడడంతోపాటు, లోక్‌సభ ఎన్నికల్లో తన కొడుకు వంశీని నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో ఇది గెలిస్తేనే తర్వాత గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్నారు. అందుకోసం అధికార పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు దీటుగా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా వివేక్‌ సిద్ధమయ్యారు. తాజాగా రూ.50 లక్షల వివేక్‌ కంపెనీ ఉద్యోగులు తరలిస్తూ హైదరాబాద్‌లో పట్టుపడ్డారు. దీంతో బాల్క సుమన్‌ ఫిర్యాదు కాస్త పనిచేసినట్లు కనిపించినా.. రూ. వందల కోట్ల సంపాదన ఉన్న వివేక్‌కు ఇది చాలా చిన్న విషయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గెలిచిన తర్వాత సీజ్‌ చేసిన డబ్బులు రాబట్టుకోవచ్చనే భానతో ప్రచారంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.