Haryana Assembly Elections 2024: బీజేపీకి క్రమశిక్షణ గల పార్గీ గుర్తింపు ఉంది. ప్రస్తుతం దేశంలో 15 రాష్ట్రాలకుపైగా అధికారంలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పదేళ్లుగా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఒక్కో రాష్ట్రాన్ని గెలుస్తూ వస్తోంది. ప్రస్తుతం హరియానా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. మరోమారు హరియానాలో కాషాయ జెండా ఎగరవేయాలని ప్రయత్నిస్తోంది. ఆ రాష్ట్ర సీఎంగా మొన్నటి వరకు మనోహర్‌లాల్ ఖట్టర్ ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ ఆయన స్థానంలో నయాబ్ సింగ్ షైనీని నియమించింది. ఖట్టర్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. షైనీ సారథ్యంలో బీజేపీ ఎన్నికలకు వెళ్తోంది. అయితే ఎన్నికల వేళ.. బీజేపీలో ట్విస్ట్ నెలకొంది. బీజేపీ గెలిస్తే మరోమారు నయాబ్ సింగ్ షైనీ సీఎం అవుతారని అంతా అనుకుంటుండగా సీనియన్ ఎమ్మెల్యే అనిల్ విజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం రేసులో ఉన్నట్లు ప్రకటించారు. బీజేపీ గెలిస్తే సీఎం పదవి అడుగుతానని ప్రకటించారు.
సీనియర్‌ను.. సీఎం పదవికి అర్హుడిని..
అసెంబ్లీ ఎన్నికల వేళ అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హరియానీ బీజేపీలో చర్చనీయాంశమయ్యాయి. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, సీఎం పదవికి అర్హుడిని అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే సీఎం పదవి కావాలని అధిష్టానాన్ని కోరతానని చెప్పారు. ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ విజ్ ఏడోసారి రేసులో ఉన్నారు. ఈ నేపత్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ఈ రోజు వరకూ నేను పార్టీ నుంచి ఏదీ కోరలేదు. హరియానా ప్రజలు నన్ను కలవడానికి వచ్చారు. అంబాలాలో కూడా ప్రజలు సీనియారీటీని ప్రస్తావించి మీరెందుకు సీఎం కాకూడదని అడిగారు. ప్రజల ఆకాంక్ష, సీనియారిటీ ప్రాతిపదికన తనకు సీఎం పదవి ఇవ్వాలని అడుగుతా’ అని 71 ఏళ్ల అనిల్ విజ్ మీడియాకు తెలిపారు. తనను సీఎం చేస్తారా లేదా అనేది అధిష్టానం ఇష్టం అని ప్రకటించారు. తాను సీఎం అయితే మాత్రం హరియానా ముఖచిత్రం మారుస్తానని తెలిపారు.