
KCR Cricket Tournament : అంబటి రాయుడు.. 140 కోట్ల మంది భారతీయుల్లో టీమిండియాకు ఆడే 11మంది ఆటగాళ్లలో మన తెలుగు వాడు ఒకడు కావడం గర్వకారణంగా చెప్పొచ్చు. రాయుడు మూలాలు ఆంధ్రాలో ఉన్నా అతడు హైదరాబాద్ లోనే పెరిగాడు. ఇక్కడే క్రికెట్ ఆడాడు. టీమిండియాకు ఆడిన అనంతరం అక్కడి రాజకీయాలకు కలత చెంది రిటైర్ మెంట్ ప్రకటించాడు. అనంతరం మనసు మార్చుకొని మళ్లీ క్రికెట్ ఆడుతున్నాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
అయితే అంబటి రాయుడు సిద్దిపేట సమీపంలో ఒక భారీ వ్యవసాయ క్షేత్రాన్ని కొన్నాడు. ఆ విషయం చాలా మందికి తెలియదు. సిద్దిపేటలోనే గల్లీ గల్లీ తిరిగాడు. ఇక్కడి చెరువులు, కుంటలు అన్నీ చూశాడు. అలాంటి క్రికెటర్ మన తెలంగాణలోని సిద్దిపేటలో తను కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి ఓ వ్యవసాయ క్షేత్రం, ఓ రైస్ మిల్ పెట్టి ఇక్కడి రైతులకు ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ సీక్రెట్ విషయాన్ని తాజాగా మంత్రి హరీష్ రావు బయటపెట్టాడు. అదే ఇప్పుడు సంచలనమైంది.
ఫిబ్రవరి 17 తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు. ఈ 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేటలో ‘కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ’ని మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. అంబటి రాయుడు క్రికెట్ ఆడడమే కాదు.. తెలుగు నాట ఆయనంటే తెలియని వారు లేరు. రాయుడుకు సిద్దిపేటతో విడదీయరాని సంబంధం ఉందట.. అదే విషయాన్ని హరీష్ బయటపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంబటి రాయుడు ఎకరంన్నర భూమిని కాలువల కోసం ఇచ్చిన గొప్ప క్రికెటర్ అంబటి రాయుడు అని హరీష్ రావు గొప్పగా కీర్తించారు. ‘కాళేశ్వరం కడుతున్నాం.. కాలువల కోసం భూములు కావాలంటే.. తెలంగాణ రైతుల కోసం అందరికంటే ముందుగా మొదట సంతకం పెట్టి తన పొలాలు ఇచ్చిన గొప్ప మనసున్న క్రికెటర్ రాయుడు’ అని హరీష్ రావు వేయినోళ్ల పొగిడారు. రాయుడుకు సిద్దిపేట అంతా తెలుసు అని .. ఇక్కడ రైస్ మిల్లు కూడా ప్రారంభించాడని తెలుసుకొని గర్వపడుతున్నట్టు హరీష్ రావు తెలిపారు.
సిద్దిపేట కాళేశ్వరం నీళ్లతో బంగారం లాంటి పంట పండిస్తున్న రాయుడు ఈరోజు మనగురించి.. తెలంగాణ అభివృద్ధి గురించి చెబుతుంటే గర్వంగా ఉందని హరీష్ రావు అన్నారు. ఎంత మంచిగా కాళేశ్వరం నీళ్లు, కరెంట్ వస్తుందో అంబటి చెబుతున్నాడు. రాయుడు కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని ప్రారంభించేందుకు వచ్చినందుకు మీ అందరి తరుఫున రాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు హరీష్ పేర్కొన్నాడు.
ఇలా అంబటి రాయుడు ఖ్యాతిని ఆయన సేవానిరతిని హరీష్ కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఘనంగా చాటడం విశేషం.

