https://oktelugu.com/

Harish Rao-KTR: అసంతృప్తుల ఇళ్లలో వాలిపోతున్న బావా బామ్మర్దులు..

అసంతృప్తుల ఇళ్లకు వెళ్తున్న బావా, బామ్మర్దులు వెంటనే అక్కడి నుంచి సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేయించడమో లేక మరుసటి రోజు ప్రగతి భవన్‌ లేదా తెలంగాణ భవన్‌కు ఆహ్వానించడమో జరుగుతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 30, 2023 4:02 pm
    Harish-Rao-KTR
    Follow us on

    Harish Rao-KTR: తెలంగాణలో రాజకీయం రంజుగా మారుతోంది. అధికార బీఆర్‌ఎస్‌ ఒకవైపు ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తూనే మరోవైపు చేరికలపై దృష్టిపెట్టింది. విపక్ష కాంగ్రెస్, బీజేపీల్లోకి కీలక నేతలను పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది. అసంతృప్తితో ఉన్నారని, టికెట్‌ రాలేదని, అలగ బూనారని తెలియగానే.. బావా, బామ్మర్దులు కేటీఆర్, హరీశ్‌రావు వారి ఇళ్లలో వాలిపోతున్నారు. మొన్న పొన్నాల లక్ష్మయ్య, నిన్న నాగం జనార్దన్‌రెడ్డి, నేడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి ఇలా.. ఎక్కడ అసంతృప్తులు ఉన్నారో తెలుసుకుని మరీ రెక్కలు కట్టుకుని అక్కడికి వెళ్లిపోతున్నారు. మరోవైపు వాళ్లు రాగానే, అసంతృప్తులు, మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌ను బండ బూతులు తిట్టినవారు ఆప్తులు అవుతున్నారు. ఆలింగనాలు, ఆత్మీయ పలకరింపులు, పార్టీలోకి ఆహ్వానాలతో ఉబ్బి తబ్బిబవుతున్నారు.

    అంతుచిక్కని హామీలు..
    అసంతృప్తుల ఇళ్లకు వెళ్తున్న బావా, బామ్మర్దులు వెంటనే అక్కడి నుంచి సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేయించడమో లేక మరుసటి రోజు ప్రగతి భవన్‌ లేదా తెలంగాణ భవన్‌కు ఆహ్వానించడమో జరుగుతోంది. ఇక్కడకు రాగానే కేసీఆర్‌ వారికి ఇలా కండువా కప్పి అలా పంపించేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు విపక్షాల నేతలు బీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరుతున్నారన్న ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే టికెట్లు ప్రకటించింది. కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. అయినా, బీజేపీలో, కాంగ్రెస్‌లో టికెట్‌ రాలేదని నిరాశలో ఉన్నవారు బీఆర్‌ఎస్‌ గూటికి వెళ్తుండడం అంతుచిక్కడం లేదు. అసలు బావా, బామ్మర్దులు ఏం హామీ ఇస్తున్నారు, కేసీఆర్‌ ఎలా మచ్చిక చేసుకుంటున్నారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చేరిన పెద్ద నాయకుల్లో పొన్నాల, నాగం, చంద్రశేఖర్‌ తదితరులు ఔట్‌డేటెడ్‌ నేతలే, విష్ణు, ఎర్రశేఖర్‌ లాంటి వారు మాత్రం యువ నాయకులు. మరి వీరికి ప్యాకేజీ ఇస్తున్నారా, పదవుల ఆశ చూపుతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విశ్లేషకులు మాత్రం ఔట్‌డేటెడ్‌ నాయకులకు ప్యాకేజీలు, యువ నాయకులకు పదవులు ఆశ చూపుతున్నట్లు పేర్కొంటున్నారు.

    పదేళ్లు అధికారంలో ఉన్నా.. చేరిన వారికే దిక్కులేదు..
    బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో దాదాపు తొమ్మిదేళ్లకుపైగా అధికారంలో ఉంది. 2014, 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు అనేకమంది నాయకులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుంది. ఇందులో చాలా మందికి మొదట పదవులు ఆశ చూపింది. కానీ పార్టీలో చేరాక చూపురు కట్టలా ఓ మూలన పెట్టేస్తున్నారు. గతంలో చేరిన వారిలో ఒక్క కేశవరావు మినహా సరైన గుర్తింపు, ప్రాధాన్యత ఉన్నవారు లేరు. అనేక నామినేటెడ్‌ పదవులు, కార్పొరేషన్‌ పదవులు ఉన్నా ఇటు ఉద్యమకారులకు, అటు పార్టీలో చేరిన వారికి ఇవ్వలేదు.

    బయట మొగరడం ఎందుకని..
    ఇటీవల బీఆర్‌ఎస్‌ జనగావమ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల్లో ఉండి మొరుగుతున్నవారినే బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నామని ప్రకటించారు. అక్కడ మొరిగేవారు ఇక్కడకి ఇవచ్చాక సైలెంట్‌గా ఉంటారని కూడా తెలిపారు. తాజాగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్న నేతల పరిస్థితి కూడా అంతేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ఎన్నికల ముగియగానే చేరినవారందరినీ పక్కన పెట్టడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్యాకేజీ తీసుకున్న వారు మాత్రం ఆ రకంగా అయినా లాభ పడతారని అంటున్నారు.

    ఓట్ల లెక్కలతోనే..
    విపక్షాల్లోని నేతలు బీఆర్‌ఎస్‌లో చేరితే ఎన్ని ఓట్లు తమ పార్టీకి వేయించగలరన్న లెక్కలను బావా, బామ్మర్దులు వేసుకుంటున్నారు. ఈ లెక్కలు పక్కాగా తేలిన తర్వాతనే అసంతృప్తుల ఇళ్లకు వెళ్తున్నారని బీఆర్‌ఎస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా చేరికలన్నీ ఓట్ల కోసమే అని పేర్కొంటున్నారు. తర్వాత వీరిని ఎవరూ పట్టించుకోరని చెబుతున్నారు.