దుబ్బాక రాజకీయ రణక్షేత్రమైంది.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నిక జరుగుతుండగా… ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్ అయితే దుబ్బాక పై మరింతగా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో వరుస ఎన్నికలు ఉండడంతో దుబ్బాక లో ఘన విజయం సాధించి బోణీ కొట్టాలని చూస్తోంది. అధికార పార్టీకి చెక్ పెట్టి తమ సత్తా చాటుకోవాలని కాంగ్రెస్ , బీజేపీ తహతహలాడుతున్నాయి. అభ్యర్థుల కంటే ప్రచార కర్తలే క్యాంపెనింగ్ లో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. టీఆర్ఎస్ ను ట్రబుల్ షూటర్ హరీశ్ రావు అన్నీ తానై నడిపిస్తున్నాడు. తనదైన వ్యూహాలతో పార్టీని విజయతీరాలకు చేర్చాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్, రేవంత్ సహ ఇతర నేతలంతా అక్కడే మకాం వేశారు. అలాగే బీజీపీకి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ తదితరులు ప్రచారం సాగిస్తున్నారు.
Also Read: బస్తీ పెద్దన్న.. బుల్లెట్ నర్సన్న.. భాగ్యనగరిలో నాయిని గురుతులు
రసవత్తరంగా సాగుతున్న దుబ్బాక పోరులో హరీశ్ రావు ముఖ్యంగా బీజేపీ నే టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఆ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో చేస్తున్న ప్రచారం కాదు.. సోషల్ మీడియాలో ఆ పార్టీ చేస్తున్న ప్రచారంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారం ఎంతగా సాగుతుందంటే చివరికి హరీశ్ సైతం సవాళ్ల కు దిగుతున్నారు. దమ్ముంటే తన వద్దకు వచ్చి నిరూపించాలని అంటున్నారు. తాను దుబ్బాకలోనే ఉన్నానని ప్లేస్ చెబుతున్నారు. దీనంతటికీ కారణం.. బీజేపీ సోషల్ మీడియా ఆయనపై వ్యక్తిగత రూమర్స్ ప్రచారం చేయడం లేదు.. టీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాల్లో.. కేంద్ర నిధులు ఉన్నాయని విపరీతంగా ప్రచారం చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్ లో రూ.1,600 కేంద్రం ఇస్తోందని బీజేపీ ప్రచారం చేస్తోంది. దాదాపు అన్ని పథకాల్లోనూ కేంద్ర నిధులే ఉన్నాయంటున్నారు. ఈ ప్రచారం జోరుగా సాగుతుండడంతో హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కేంద్ర నిధులు ఉన్నాయని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అయితే బీజేపీ నేతలు కూడా దీటుగానే సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలను బెదిరించడానికే హరీశ్ రావు అరుస్తున్నారని.. తెలంగాణకు ఆరేళ్ల కాలంలో ఇచ్చిన హామీలను ఒక్కటైనా నెరవేర్చారో లేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అరిచేరావుగా మారి అరిచినంత మాత్రన జనం ఓట్లేయరని అంటున్నారు.
Also Read: తిరుపతి బరిలో టీడీపీ..అభ్యర్థి ఆయనే..!
ఇదిలా ఉండగా హరీశ్ రావు మాత్రం వ్యూహత్మకంగా టీఆర్ఎస్ పథకాలపై మరింత జోరుగా ప్రచారం జరిగే ఉద్దేశంతోనే.. బీజేపీ కేంద్ర నిధుల అంశాన్ని హైలెట్ చేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అప్పుడే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్న వారు గుర్తు పెట్టుకుని ఓటేస్తారిని అంటున్నారు. హరీశ్ వ్యూహాలపై బీజేపీ ఎదురు దాడి చేస్తోందో.. బీజేపీ ని ప్లాన్డ్ గా పథకాల ప్రచారంలోకి హరీశ్ లాగుతున్నరో అర్థం కాని రాజకీయం ప్రస్తుతం దుబ్బాకలో నడుస్తోంది. కాగా.. హరీశ్ సవాల్ పై బీజేపీ రాష్ట్ర నేతలు ఇప్పటి వరకూ స్పందించలేదు.