Harirama Jogaiah: వివిధ కారణాలతో రాజకీయాలకు దూరమైన వారు విశ్లేషకులుగా అవతారం ఎత్తుతున్నారు. రాజమండ్రి నుంచి ఎంపీగా రెండుసార్లు గెలిచిన ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలానే విశ్లేషకుడిగా మారుతానని వృద్ధ నేత హరి రామ జోగయ్య ప్రకటించారు. గత కొంతకాలంగా కాపు సంక్షేమ సేన పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. జనసేనకు అండగా నిలబడుతూ వచ్చారు. అయితే మీ సలహాలు మాకొద్దు అంటూ పవన్ తేల్చి చెప్పడంతో వృద్ధనేత నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కాపు సంక్షేమ సేనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో ఉండవెల్లి అరుణ్ కుమార్ ఒక వెలుగు వెలిగారు. 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. మరి ఏ పార్టీలో చేరలేదు. అప్పుడప్పుడు విలేకరుల సమావేశం పెట్టి సమకాలిన రాజకీయ అంశాలపై మాట్లాడుతుంటారు. తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తుంటారు. రాజకీయాల గురించి మాట్లాడినా.. ఆయన ఏ పార్టీలో చేరకపోవడంతో హాయిగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ వస్తున్నారు. ఇప్పుడు హరి రామ జోగయ్య సైతం అదే బాటలో వెళ్లాలని నిశ్చయించుకోవడం విశేషం.
గత కొంతకాలంగా జనసేనకు అనుకూలంగా హరి రామ జోగయ్య మాట్లాడుతూ వస్తున్నారు. ఆ పార్టీకి విలువైన సలహాలు సూచనలు అందించారు. ముఖ్యంగా టిడిపి తో పొత్తులు, సీట్ల సర్దుబాటు విషయంలో చాలా రకాలుగా సలహాలు ఇచ్చారు. అయితే అది పవన్ కు నేరుగా కాకుండా లేఖాస్త్రాలు సంధించడంతో వివాదంగా మారాయి. అటు పవన్ సైతం హరి రామ జోగయ్య వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు. వాటి వెనుక వైసిపి హస్తం ఉందని అనుమానించారు. అందుకే తాడేపల్లిగూడెం సభలో తాను ఎవరి సలహాలు పాటించవలసిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మొన్నటికి మొన్న మంగళగిరి పార్టీ సమావేశంలో సైతం తనకు సలహాలు ఇస్తారు.. వైసీపీలో చేరిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవి ముద్రగడ పద్మనాభం, హరి రామ జోగయ్య ను ఉద్దేశించి చేసినవేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే హరి రామ జోగయ్య కాపు సంక్షేమ సేనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు. విశ్లేషకుడిగా మారుతానని మాత్రమే చెప్పుకొచ్చారు. అంటే ఈ వృద్ధ నేత ఇక రాజకీయాల గురించి విశ్లేషిస్తారు అన్నమాట. అయితే ఏ పార్టీని టార్గెట్ చేస్తూ విశ్లేషిస్తారు అన్నది చూడాలి.