
Gurrampati Devender Reddy: ఏపీలో అధికార వైసీపీ భారీ స్థాయి ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటుచేసుకుంది. విపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రైవేటు ఆర్మీ తరహాలో వేలాది మంది పనిచేసేవారు. ముఖ్యంగా సోషల్ మీడియా వింగ్ చాలా యాక్టివ్ గా పనిచేసేది. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి.. చంద్రబాబు ఓటమికి సోషల్ మీడియా యాక్టివ్ రోల్ ప్లే చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి, రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారానికి ఏ స్థాయిలో పాటుపడాలో ఆ స్థాయిలో పాటుపడుతోంది. చివరకు న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనక్కి తగ్గలేదు. అయితే ఇటువంటి కామెంట్స్ చేయడంలో ముందంజలో ఉండేవారు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి.
Also Read: Rayalaseema- CM Jagan: జగన్.. మరోసారి రాయలసీమకు అన్యాయం తప్పదా ?
ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జిగా సజ్జల రామక్రిష్ణారెడ్డి కుమారుడు ఉన్నారు. అయితే పూర్వాశ్రమంలో మాత్రం దేవేందర్ రెడ్డే ఉండే వారు. వైసీపీ ప్రభుత్వం అతడ్ని చీఫ్ డిజిటల్ డైరెక్టర్ పదవి కట్టబెట్టింది. లక్షలకు లక్షలు జీతాలు సైతం చెల్లించింది. ఆ సమయంలో రాజకీయ ప్రత్యర్థులు, వైసీపీకి కానీ, జగన్ ను కానీ విమర్శించిన వారిపై దేవేందర్ రెడ్డి విరుచుకుపడేవారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అనరాని మాటలు అనేవారు. చివరకు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీబీఐ కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం విచారణను సైతం ఎదుర్కొంటున్నారు.

అయితే ఉన్నట్టుండి దేవేందర్ రెడ్డి కాస్తా వెనక్కి తగ్గారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణం రాజుకు సారీ చెప్పారు. ఏకంగా లిఖితపూర్వకంగా క్షమాపణ కోరారు. గతంలో మీ విషయంలో చాలారకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేశానని.. వాటన్నింటినీ చింతిస్తూ.. మరోసారి అటువంటి కామెంట్స్ చేయనని ప్రాధేయపడ్డారు. గతంలో డిజిటల్ డైరెక్టర్ పదవిలో ఉన్నప్పుడు పదవిని దుర్వినియోగం చేస్తున్నారని. రాజకీయ ప్రత్యర్థులపై సోషల్ మీడియా వేదికగా చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రఘురామక్రిష్ణంరాజు లోకాయుక్తను ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం దేవేందర్ రెడ్డి అడవుల కార్పొరేషన్ పదవిలో కొనసాగుతున్నారు. అటు తాను చేసిన తప్పునకు క్షమించాలని లిఖితపూర్వకంగా కోరడం, అందుకు రఘురామక్రిష్ణంరాజు నుంచి ఎటువంటి రిప్లయ్ లేకపోవడంతో ఇక్కడితో కేసు ముగిసినట్టేనని భావించి లోకాయక్త కేసు క్లోజ్ చేసింది. అధికారంలో ఉన్నప్పుడే క్షమాపణలు కోరడం చూస్తుంటే.. రేపు అధికారం కోల్పోతే వారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Also Read:Maoist Letter: శ్రీకాకుళం జిల్లాలో మావోయిస్టుల లేఖల కలకలం.. ఆ మంత్రికి రెండోసారి హెచ్చరికలు