
అంతటి ఎన్టీఆర్ కే ‘గుడివాడ’ సెంటిమెంట్ తప్పలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ఒక లెక్కనా? రాజకీయ చదరంగంలో పావులే రాజులు కావచ్చు. బలమైన రాజులు ఓడిపోవచ్చు. కర్ణాటకలో ముక్కి దాదాపు 40 సీట్లు అటూ ఇటూగా వచ్చిన కుమారస్వామి ఆ రాష్ట్రానికి సీఎం అవ్వలేదా? ఇలా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇలాంటి ఊహించని పరిణామం త్వరలో ఏపీలో చోటుచేసుకోనుందా అంటే ‘గుడివాడ’ సెంటిమెంట్ తో అది సాధ్యమేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బలమైన బీజేపీ కేంద్రంలో, రాష్ట్రంలో కాచుకొని కూర్చుంది. హిందూ ఆలయాలపై దాడులు, ఏపీలో అపచారంపై హిందూ భక్తులు ఆగ్రహంతో ఉన్నారు. వీటన్నింటికి కేంద్ర బిందువైన మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు హిందువుల పుండు మీద కారం చల్లినట్టు ఉంది. ఇక కేసులు మెడకు చుట్టుకొని సీఎం జగన్ కత్తిమీద సాము చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గుడివాడ’ సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఏపీ ప్రభుత్వం కూలిపోవచ్చన్న చర్చ ఏపీ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
గుడివాడ.. అదో గ్రహవాడలా ఏపీ రాజకీయాల్లో బ్యాడ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఎందుకంటే గుడివాడ నుంచి గెలిచి మంత్రి అయిన ప్రతీసారి ఆ ప్రభుత్వం కూలిపోయిందని చరిత్ర చెబుతోంది. ఉమ్మడి ఏపీ విడిపోకముందు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచే ఈ చరిత్ర సెంటిమెంట్ కొనసాగుతుండడం విశేషం.
1955 లో గుడివాడ నుండి గెలిచిన దళిత ఎమ్మెల్యే వేముల కూర్మయ్యకి ప్రకాశం పంతులు కేబినెట్ లో స్థానం కల్పించారు. కానీ, ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదు. ఎన్టీఆర్ కూడా 1983 లో గెలిచి ముఖ్యమంత్రి అయినా 1984 లో నాదెండ్ల భాస్కరరావు కారణంగా ముఖ్యమంత్రి పీఠానికి దూరమయ్యారు. ఇక, 1985 లో హిందూపురం, గుడివాడ నుండి పోటీ చేసి రెండు చోట్లా గెలిచిన ఎన్టీఆర్.. సెంటిమెంట్ తో గుడివాడని వదిలేసుకున్నారు. 1989 లో గుడివాడ నుండి గెలిచిన కటారి ఈశ్వర్ కుమార్ ని చెన్నారెడ్డి కేబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఆయన ప్రభుత్వం కూడా పూర్తికాలం లేదు. ఇలా గుడివాడ నుండి గెలిచి మినిస్ట్రీ లో ఎవరున్నా ఆ గవర్నమెంట్ పూర్తి కాలం లేదన్న సెంటిమెంట్ అప్పటి నుంచేే మొదలైంది. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వం కూలబోతుందా అన్న చర్చ మొదలైంది.
ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హిందుత్వంపై దాడులు సెగలు రేపుతున్నాయి. హిందువులపై నోరుపారేసుకొని దేవుళ్లు, ఆలయాలపై పరుష వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తోంది కూడా ‘గుడివాడ’ నుంచే కావడం గమనార్హం. ప్రస్తుతం 151 మంది ఎమ్మెల్యేలతో ఏపీ ప్రభుత్వం అత్యంత బలంగా ఉంది. దాన్ని కూల్చే సాహసం ఎవరూ చేయరని వైసీపీ నమ్మకంతో ఉంది. కానీ ఏమో గుర్రం ఎగురావచ్చు కదా.. అదే ‘హిందుత్వంపై ఏపీలో దాడులు’ వైసీపీ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం కావచ్చు కదా అన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
బీజేపీ, హిందుత్వవాదుల సెగలతో ఏపీ మంత్రి కొడాలి నాని సీటుకే ఎసరు వచ్చేలా ఉంది. ఆ సెగ ఏపీ ప్రభుత్వానికి కూడా తగిలే అవకాశాలున్నాయంటున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ మెడకు ఉన్న కేసులు బీజేపీ తలుచుకుంటే ఉచ్చు బిగించి ఆయనను జైలుకు పంపొచ్చు. అదే జరిగితే ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చడం పెద్ద విషయం కాదంటున్నారు విశ్లేషకులు. బీజేపీ ఎదురుతిరిగితే జగన్ తట్టుకునే అవకాశాలు లేవంటున్నారు.
గుడివాడ సెంటిమెంట్ కాస్త పునరావృతం అయితే ఖచ్చితంగా ఏపీలో ప్రభుత్వం కూలుతుందని.. జగన్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో సాగుతోంది.
Comments are closed.