Gudivada Amarnath: వైసీపీ అభ్యర్థుల ప్రకటన కొనసాగుతోంది. తాజాగా 13వ జాబితా విడుదలైంది. మంగళవారం రాత్రి జాబితాను ప్రకటించారు. చిలకలూరిపేట ఇన్చార్జిగా మనోహర్ నాయుడు ను నియమించారు. గాజువాక ఇన్చార్జిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ను ప్రకటించారు. అలాగే కర్నూలు మేయర్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణమ్మను నియమించారు. ఇప్పటివరకు మేయర్ గా ఉన్న బివై రామయ్య ను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రామయ్య స్థానంలో సత్యనారాయణమ్మను నియమించారు.
మంత్రి విడదల రజిని చిలకలూరిపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆమెకు గుంటూరు పశ్చిమ స్థానానికి పంపించారు. ఆమె స్థానంలో చిలకలూరిపేటకు మల్లెల రాజేష్ నాయుడు ను నియమించారు. కానీ రాజేష్ నాయుడు అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైసీపీ హై కమాండ్ ఆయనను తొలగించింది. ఆయన స్థానంలో గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ను నియమించింది. అయితే ఈ నిర్ణయాన్ని రాజేష్ నాయుడు తప్పు పడుతున్నారు. టికెట్ కోసం మంత్రి విడదల రజిని తన వద్ద 6.5 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు చేశారు. తన స్థానంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కు టికెట్ ఇవ్వాలని కోరారు. ఇక్కడ తాజా నియామకం వివాదానికి దారితీసింది.
అటు గాజువాక ఇన్చార్జిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ను నియమించారు. ఈయన అనకాపల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ సమన్వయకర్తగా మలసాల భరత్ అనే కొత్త వ్యక్తికి కొద్ది నెలల కిందట నియమించారు. కానీ అమర్నాథ్ విషయంలో ఎటువంటి క్లారిటీ లేదు. ఆయనకు ఎక్కడా ఇన్చార్జిగా నియమించలేదు. దీంతో అమర్నాథ్ కు టికెట్ లేదని ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో పక్కన పెడతారని టాక్ నడిచింది. కానీ అనూహ్యంగా గాజువాక నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు.గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిప్పల నాగిరెడ్డి ఉన్నారు. ఆయన కుమారుడు దేవాన్ రెడ్డి ఇన్చార్జిగా కొనసాగుతూ వచ్చారు. కానీ ఆయన స్థానంలో వరికుటి చందును ఇన్చార్జిగా నియమించారు. కానీ ఆయన పనితీరు బాగాలేదని చెప్పి గుడివాడ అమర్నాథ్ కు తాజాగా అవకాశం ఇచ్చారు. దీంతో గాజువాకలో ముచ్చటగా మూడో నాయకుడు వచ్చినట్టు అయింది. గత ఎన్నికల్లో గాజువాక స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ సైతం బరిలో నిలిచింది. దీంతో వైసిపి గెలుపొందింది. ఈసారి పొత్తు కుదరడంతో గెలుపు పక్కా అని తేలుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అభ్యర్థులను మార్చడం ద్వారా వైసీపీలో ఒక రకమైన గందరగోళం నెలకొంది.దీంతో గుడివాడ అమర్నాథ్ గెలుపు ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.