BJP: తెలంగాణలో బిజెపి ఓట్లు, సీట్లను గణనీయంగా పెంచుకుంది. మొన్నటి ఎన్నికల్లో 14 శాతం ఓట్లతో.. 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఒకానొక దశలో తెలంగాణలో అధికారంలోకి వస్తామని బిజెపి నేతలు ప్రకటించారు. ఆ స్థాయిలో కనిపించారు కూడా. అయితే విధానపరమైన నిర్ణయాలు, నాయకత్వం మార్పు తదితర వాటిలో బిజెపి వెనుకబడింది. అటు జనసేనతో పొత్తు జాప్యం జరిగింది. ఇవన్నీ ఫలితాలపై ప్రభావం చూపాయి. లేకుంటే మాత్రం సీట్లు పెంచుకొని.. తెలంగాణలో హంగ్ కు కారణమయ్యేది. ఒక రాజకీయ శక్తిగా మారేది.
అయితే తెలంగాణలో చేజారిపోయిన అవకాశం.. ఏపీలో దక్కించుకునేందుకు చక్కనైన మార్గం ఇప్పుడు కనిపిస్తోంది. అధికారపక్షంగా వైసిపి ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి కొనసాగుతోంది. టిడిపి తో జనసేన జతకట్టింది. బిజెపికి మిత్రపక్షంగా కొనసాగుతోంది. ఒకవేళ జనసేన, బిజెపి ఒక్కటైనా… బిజెపి ఒంటరిగా బరిలో దిగినా మూడో ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు బిజెపి గూటికి చేరే అవకాశం ఉంది. అంతలా మారనున్నాయి ఏపీ రాజకీయ పరిస్థితులు.
అధికార వైసిపి రాష్ట్రవ్యాప్తంగా 50 నుంచి 60 మంది సిట్టింగులను మార్చనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 11మంది అభ్యర్థులను మార్చి సంకేతాలు పంపించింది. అటు తెలుగుదేశం పార్టీ సైతం మార్పులకు సిద్ధపడుతోంది. ఒకవేళ జనసేనతో పొత్తు కుదుర్చుకున్నా 30 సీట్ల వరకు కోల్పోవాల్సి ఉంటుంది. అంటే దాదాపు ఒక 100 మంది వరకు వైసిపి, టిడిపి నేతలు పోటీకి దూరం కావాల్సి ఉంటుంది. వీరందరూ బిజెపి వైపు మొగ్గుచూపితే.. ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉండడం.. మరోసారి అధికారంలోకి వస్తుందని సూచనలు ఉండడంతో బిజెపి ఏపీలో ప్రభలమైన శక్తిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో టిడిపి నుంచి జనసేన ను వేరుచేసి తన వైపు తిప్పుకుంటే ఏపీలో బిజెపి రాజకీయాలను శాసించడం ఖాయం.
అయితే ఈ విషయంలో కేంద్ర పెద్దల కంటే రాష్ట్ర బిజెపి నాయకులు చొరవ చూపాలి. తమదైన రాజకీయాలు చేయాలి. మొన్నటివరకు వైసీపీకి అనుకూలమైన నాయకత్వం బిజెపిలో ఉండేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన నాయకత్వం వచ్చింది. ఒకవేళ బిజెపి మూడో ప్రత్యామ్నాయం అయితే టిడిపి కి దెబ్బ ఖాయమని భావిస్తే మాత్రం ఈ ప్రయత్నం ఫలించదు. అయితే రాష్ట్ర బిజెపి దూకుడు కనబరిస్తే మాత్రం ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి మంచి రాజకీయ భవిష్యత్ రావడం ఖాయం. వసుంధర రాజెలా బిజెపిలో మంచి నాయకురాలుగా ఎదిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గుర్తింపు లభించనుంది. అయితే అందుకు ఏపీ బీజేపీ సిద్ధంగా ఉందా? లేదా? అన్నది ఇప్పుడు తెలియాలి.