
గంటకు 12-15 కిలోమీటర్ల వేగంతో తెలంగాణపైకి దూసుకొస్తున్న మిడతల దండును ఎలా ఎదుర్కోవాలో అనే అంశం పై రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండు దిశను మార్చుకోకుంటే.. మరో 27 గంటల్లో.. రాకాసి మిడతల దండు తెలంగాణపై దాడి చేయడం ఖాయం. పాకిస్తాన్ నుంచి భారత్ లోకి ప్రవేశించిన మిడతలు.. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లో పంటలకు నష్టం కలిగించాయి. మధ్యప్రదేశ్ నుంచి కొన్ని మిడతలు ఝాన్సీ గుండా ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించగా.. ఇంకొన్ని మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చేరాయి. ఈ కీటకాల గుంపు తెలంగాణవైపునకే దూసుకొచ్చే అవకాశాలుండటంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది.
మిడతల దాడి నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి.. మహారాష్ట్ర అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపుతున్నారు. మిడతల దండు రాష్ట్ర సరిహద్దుకు 400 కిలోమీటర్ల దూరంలో ఉందని, అవి రాష్ట్రంలోకి ప్రవేశించేది లేనిది మరికొద్ది గంటల్లో తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డిలో హైఅలర్ట్ ప్రకటించినట్లు తెలిసింది.
మహారాష్ట్రలోనూ వ్యవసాయ అధికారులు.. మిడతల్ని పారద్రోలేందుకు చర్యలు చేపట్టినా, వాటి ప్రభావం తక్కువగా ఉందని, రాకాసి దండు తెలంగాణలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తెలుస్తోంది. దీనిపై వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి.. సరిహద్దు జిల్లాల అధికారులు, కీటకాలను పారదోలడంలో నిపుణులైనవారితో అత్యవసర సమీక్ష నిర్వహించారు. మిడతలు దాడి చేసే అవకాశమున్న జిల్లాల్లో యంత్రాంగం, రైతులు.. రసాయనాలతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు జిల్లా, గ్రామ స్థాయిల్లో కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు జనార్థర్ రెడ్డి సూచించారు.