Bribe: లంచం తీసుకున్నాడు.. ఏసీబీ అధికారుల కళ్ళుగప్పి పరారయ్యాడు

పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన లింగాల సురేంద్ర రెడ్డి తన సొంత ఆస్తిని మార్చిలో రిజిస్టర్ చేసుకున్నారు. ఇందుకుగాను అప్పట్లో రూ. 30,000 లంచం ఇచ్చారు. స్టాంపు డ్యూటీ తక్కువతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ఇటీవల ఆడిట్లో గుర్తించారు.

Written By: Neelambaram, Updated On : November 23, 2023 3:08 pm
Follow us on

Bribe: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు అధికారి. మధ్యవర్తి ద్వారా నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విచారణ చేపడుతుండగా సదరు అధికారి పరారయ్యాడు. ఈ ఘటన సత్యసాయి జిల్లా బుక్కపట్నం లో వెలుగు చూసింది. ఎందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన లింగాల సురేంద్ర రెడ్డి తన సొంత ఆస్తిని మార్చిలో రిజిస్టర్ చేసుకున్నారు. ఇందుకుగాను అప్పట్లో రూ. 30,000 లంచం ఇచ్చారు. స్టాంపు డ్యూటీ తక్కువతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ఇటీవల ఆడిట్లో గుర్తించారు. ప్రభుత్వానికి నాలుగు లక్షల మేర చెల్లించాల్సి వస్తుందని.. లక్ష రూపాయలు ఇస్తే సబ్ రిజిస్టర్ మొత్తం మాఫీ చేస్తారని డాక్యుమెంట్ రైటర్ శ్రీహరి చెప్పుకొచ్చాడు. సురేంద్ర రెడ్డి పై ఒత్తిడి తెచ్చాడు. అయితే తాను అంత ఇచ్చుకోలేనని సురేంద్ర రెడ్డి చెప్పడంతో చివరకు రూ.50 వేలకు బేరం కుదిరింది. అయితే లంచం ఇచ్చేందుకు మనసు అంగీకరించని సురేంద్ర రెడ్డి ఈనెల 16న ఏసీబీ కార్యాలయానికి సంప్రదించాడు.

ఏసీబీ అధికారుల సూచనల మేరకు బుధవారం సాయంత్రం సురేంద్ర రెడ్డి సబ్ రిజిస్టార్ శ్రీనివాసుల నాయక్ ను కలిశారు. రూ.10 వేలు ఇవ్వచూపారు. అయితే తనకు కాదని.. డాక్యుమెంట్ రైటర్ కి ఇవ్వాలని సబ్ రిజిస్టార్ సూచించారు. ఆ ప్రకారమే సురేంద్రరెడ్డి డాక్యుమెంట్ రైటర్ కు నగదు ఇచ్చారు. తరువాత ఆ డబ్బును డాక్యుమెంట్ రైటర్.. సబ్ రిజిస్ట్రార్కు ఇవ్వగానే అక్కడే మోటువేసిన ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. సబ్ రిజిస్టార్ తో పాటు డాక్యుమెంట్ రైటర్ ను అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు వారిద్దర్నీ విచారించారు. భోజన విరామ సమయంలో శ్రీనివాసులు నాయక్ అక్కడ నుంచి తప్పించుకున్నారు. దీంతో అధికారులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిందితుడు పరారీ కావడంతో కేసు సంచలనంగా మారింది.