దేశంలో కరోనా మహమ్మారి లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఇందులో ఒకే ఇంటికి చెందిన వారు పలువురు ఉంటే.. వారిలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉండడం అత్యంత విషాదం. తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మిగిలిపోయిన పిల్లలు ఎందరో ఉన్నారు. అలాంటి వారి పరిస్థితి ఏంటన్నది ఎవ్వరికీ అర్థంకాని అంశం. అసలు ఇది ఎవ్వరూ పట్టించుకోని అంశంగా కూడా మారిపోయింది.
అందుకే.. స్వయంగా న్యాయస్థానాలు పట్టించుకున్నాయి. కరోనా కారణంగా తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మిగిలిపోయిన పిల్లల భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అయితే.. ఎప్పటి లాగానే అలవాటైన హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు.. క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధిని ప్రదర్శించట్లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసలు అనాథ పిల్లలను ఎలా గుర్తిస్తారు అన్నదానికి ప్రభుత్వాల వద్ద సరైన సమాధానం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకోసం ప్రభుత్వాలు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తాయన్నది స్పష్టత లేదని అంటున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు తాము అనాథలమేనని ఎవరికి వెళ్లి చెప్పుకుంటారు? పోనీ.. ఇతర బంధువులు ఉన్నారని అనుకున్నా.. వారు తమ పనులు మానుకొని ఎన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతారన్నది ప్రశ్నార్థకం. ఒకసారి వెళ్లగానే పనులు పూర్తయ్యే పరిస్థితి ఏ విషయంలోనూ లేదన్నది అందరికీ తెలిసిందే.
ఇలాంటి పరిస్థితుల్లో.. అనాథ పిల్లల గుర్తింపే సమస్యగా మారింది. ఇక, ప్రభుత్వ సాయం అందుకోదలిచిన అనాథ పిల్లలకు తెల్ల రేషన్ కార్డును కూడా లింకు పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇన్ని అవాంతరాలు అధిగమించి ఎంత మంది బాధితులు ప్రభుత్వ సహాయం పొందుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక్కటి మాత్రం వాస్తవం. బాలలే దేశ భవిష్యత్ అన్నది ఎవరో చెప్పాల్సిన పనిలేదు. వారిని సంరక్షించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలదే. కరోనా విలయానికి బలైన వారి పిల్లల ఆలనాపాలనా చూడడం కనీస ధర్మంగా భావించాల్సిన అవసరం ఉంది.