
దేశంలోకి చైనా వైరస్ ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ 4.0 కొనసాగుతోంది. మే 31వరకు లాక్డౌన్ 4.0 ఉండనుంది. లాక్డౌన్ కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు సిద్ధపడుతోంది. మే నెల జీతంలో కోత విధించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జూన్ 1న నిరసన వ్యక్తం చేసేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది.
ఈమేరకు కమిటీలోని 30మంది నాయకులు వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించి కార్యాచరణను ప్రకటించారు. ఉద్యోగులంతా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులతో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. జూన్ 1న ఉదయం 10:30 నుంచి 11:30వరకు నిరసన తెలిపేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలకు వినతిప్రతాలు అందజేయాలని జేఏసీ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడునెలలు కోతలు విధించడం వల్ల లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని జేఏసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు సిద్ధమవుతుండటంతో ప్రభుత్వం ఏవిధంగా ముందుకెళుతుందనేది ఆసక్తికరంగా మారింది.