దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనందరికీ తెలిసిందే. రోజురోజుకు పంట పండించడానికి ఖర్చులు పెరిగిపోతున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల రేట్లను కంపెనీలు అమాంతం పెంచేస్తున్నాయి. ఖర్చులు పెరుగుతున్నా రైతుల ఆదాయం మాత్రం పెరగడం లేదు. అప్పులు తెచ్చి పంటలు పండిస్తున్న రైతులు పంట అమ్మగా వచ్చిన డబ్బులు వడ్డీలకు సైతం సరిపోవడం లేదు.
Also Read : విపక్షాల సంచలనం.. డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాసం
గత కొన్నేళ్ల నుంచి ఏపీ రైతులు అనావృష్టి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ సంవత్సరం మాత్రం విచిత్రమైన సమస్య ఏర్పడుతోంది. అతివృష్టి రైతులను ఇబ్బందులు పెడుతోంది. పంట కోతకు వచ్చిన సమయంలో వర్షాలు పడటంతో పంటలు దెబ్బ తింటున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కరువు జిల్లాలుగా పేరొందిన కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.
వారం పది రోజుల నుంచి ప్రతిరోజూ వర్షాలు కురుస్తూ ఉండటంతో పలు ప్రాంతాల్లో కూరగాయలు పంట చేలలోనే కుళ్లిపోయాయి. ఇలాంటి సమయంలో రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది. గతంలో పంటలకు బీమాలు చేయించిన జగన్ సర్కార్ వాటి ద్వారా ప్రయోజనం కలిగేలా చేయాల్సి ఉంది. దేశానికి రైతే వెన్నెముక. అలాంటి రైతు కష్టాల కడలిలో ఉన్న సమయంలో ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది.
కరోనా, లాక్ డౌన్ వల్ల గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇప్పటికే అష్టకష్టాలు పడుతున్నారు. అయితే రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెబుతున్న జగన్ సర్కార్ నుంచి రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అనవసరమైన విషయాలపై స్పందించే టీడీపీ సైతం రైతుల సంక్షేమం గురించి, రైతులు పడుతున్న కష్టాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. రైతుల పడుతున్న కష్టాలను చూసి జగన్ సర్కార్ కరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.
Also Read : ఏపీ పరువును గంగలో కలుపుతున్న టీడీపీ వైసీపీ నేతలు?