కరోనా సెకండ్ వేవ్.. లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ స్తంభించింది. సినిమా షూటింగ్ లన్నీ వాయిదాపడ్డాయి. తెలంగాణలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఇప్పుడిప్పుడే నిర్మాణాంతర కార్యక్రమాలు మళ్లీ జోరందుకుంటున్నాయి.
తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ దారిలో నడిచింది. సినిమా ప్రియులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మూతపడ్డ థియేటర్లు తెరిచేందుకు ఎట్టకేలకు అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50శాతం అక్యుపెన్సీతో జులై 8వ తేదీ నుంచి థియేటర్లు నడిపించాలని ప్రభుత్వం సూచించింది.
ఏపీలో కూడా థియేటర్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దర్శక నిర్మాతలు విడుదల తేదీలపై సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే థియేటర్లలో సినిమాల ప్రదర్శకు అనుమతిచ్చినా ఇప్పటివరకు ఏపీలో ఇవ్వలేదని సినిమాలు విడుదల చేయలేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో థియేటర్లకు అనుమతి ఇవ్వడంతో తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ భేటికి నిర్ణయించారు. ఈనెల 7న ఈ సమావేశం పెడుతున్నారు. ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న నిర్మాతలు ఇప్పుడు ఒకేసారి ఓటీటీ, థియేటర్లలో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.
ఇక సినిమాలన్నీ థియేటర్లలోనే విడుదల చేయాలని థియేటర్స్ నిర్వాహకులు కోరుతున్నారు. ఓటీటీలోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. దీంతో ఇక నుంచి వరుసగా సినిమాలు థియేటర్లలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.