Homeజాతీయ వార్తలుTS Govt Employees: జీతాలు మహాప్రభో.. బంగారు తెలంగాణలో అంతే!

TS Govt Employees: జీతాలు మహాప్రభో.. బంగారు తెలంగాణలో అంతే!

TS Govt Employees: పేపర్ బిల్లు, పాల బిల్లు, పచారీ సమాను ఖాతా, పిల్లల స్కూల్ ఫీజు, బ్యాంకు లోన్ కు సంబంధించిన ఈఎంఐ, నెలవారి బ్యాంకులో వేయాల్సిన సేవింగ్స్.. ఇవన్నీ జరగాలంటే మొదటి తారీఖు నాడు జీతం పడాలి. ఆ జీతం ఖాతాలో పడితేనే జీవితం ముందుకు కదులుతుంది. బతుకు బండి సాఫీగా సాగుతుంది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. ప్రైవేటు ఉద్యోగులు మాత్రమే కాదు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇదే వర్తిస్తుంది. కాకపోతే వారికి జీతాలు పెద్ద అంకెల్లో ఉంటాయి. అదే స్థాయిలో వారికి ఖర్చులు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సమయానికి రావడమే గగనం అయిపోయింది.. బంగారు తెలంగాణలో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ పరిస్థితి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఉద్యోగుల వేతనాలకు సంబంధించి సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్ అవడం పరిస్థితి తీవ్రతను తేట తెల్లం చేస్తోంది.

16 వేల కోట్ల మిగులు బడ్జెట్

తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. ప్రభుత్వం అడ్డు అదుపు లేని తీరు వల్ల మిగులు బడ్జెట్ కాస్త లోటు బడ్జెట్లోకి వెళ్లిపోయింది. వస్తున్న ఆదాయం తెచ్చిన అప్పులకే సరిపోతుంది. దీనికి తోడు అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలంగాణ బడ్జెట్ ను అమాంతం మింగేస్తున్నాయి. దీనివల్ల ఆర్థికంగా ఒత్తిడి పెరిగిపోతుంది. ప్రతినెలా ఒకటో తారీఖు ఉద్యోగులకు జీతాలు సర్దుబాటు చేయలేక ప్రభుత్వం సతమతమవుతోంది. జిల్లాల వారీగా తేదీలు నిర్ణయించుకొని వేతనాలు ఉద్యోగుల ఖాతాల్లో వేస్తోంది. దీనివల్ల నెలవారీగా ఈఎంఐ లు చెల్లించలేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇది వారి సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తోంది

సోషల్ మీడియాలో ట్రోల్

సోషల్ మీడియాలో ఏదైనా వర్తమాన విషయాలకు సంబంధించి కానీ, లేక ఇతర సంఘటనల గురించి గానీ ట్రోల్స్ రావడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఉద్యోగుల వేతనాలను కూడా ఈ జాబితాలోకి తీసుకొచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి విలేకరులు తీసుకెళ్తే..ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వం మీదకి నెట్టేస్తున్నారు. మొదట్లో జీతాలు సక్రమంగా వచ్చినప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని అడిగితే వితండవాదానికి దిగుతున్నారు. కొన్ని కొన్ని సెక్షన్లు మినహాయిస్తే ఇప్పటికీ కూడా ప్రభుత్వ శాఖలలో నెలనాడు జీతం సరిగా రాకపోతే ఇబ్బంది పడే కుటుంబాలు ఎన్నో. వారిని దృష్టిలో పెట్టుకోకుండా ప్రభుత్వం పంచుడు పథకాలకు ప్రాధాన్యం ఇస్తుండడం వల్ల అసలుకే మోసం వస్తున్నది. పైగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు భారీగా పెరుగుతుండడంతో ఉద్యోగులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

బెనిఫిట్స్ ఇవ్వలేక..

వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ వయసు 61 సంవత్సరాలు. రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రయోజనాలు అందించే విషయంలో ప్రభుత్వ దగ్గర డబ్బులు లేకపోవడంతో.. వారి పదవి విరమణ వయసును పెంచింది. దీనికి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చామని కలరింగ్ ఇచ్చింది. వాస్తవానికి ఒక మనిషి 60 దాటిన తర్వాత అంత చురుగ్గా పనిచేయలేడు. కొంతమంది ఇందుకు మినహాయింపు అయినప్పటికీ.. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులలో విజృంభిస్తున్న దీర్ఘకాలిక రోగాల మధ్య పని చేయడం అనేది అత్యంత కష్టంతో కూడుకున్నది. వీటిని గుర్తెరగకుండా ప్రభుత్వం రిటర్మెంట్ వయసు పెంచామని చెబుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు ఉన్నాయి.. ఇలాంటి తెలంగాణ కోసమా మేం ఉద్యమాలు చేసింది అనే ప్రశ్న ఉద్యోగుల్లో వ్యక్తం అవుతుందంటే ఎక్కడో తేడా కొట్టినట్టు..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version