Pawankalyan : వారాహి రెండో విడత యాత్ర సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. ప్రభుత్వ వైఫల్యాలు, వ్యవస్థల్లో లోపాలు గురించి పవన్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఆలోచింపజేశాయి కూడా. అయితే తణుకు సభలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్ ప్రసంగం ప్రారంభించినప్పుడు ఆయన నోటి నుంచి క్షమించండి అన్న కామెంట్ బయటకు వచ్చింది. దీంతో సభికులు, జన సైనికులు, అభిమానులు ఆసక్తిగా తిలకించారు. ఓ వ్యక్తిని పట్టుకొని నేను మీకు క్షమాపణలు చెబుతున్నానంటూ పవన్ చెప్పడంతో ఒక్కసారిగా సభ సైలెంట్ గా మారిపోయింది.
జనసేనకు బలమున్న నియోజకవర్గాల్లో తణుకు ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన అభ్యర్థి 31 వేల పైచిలుకు ఓట్లను సాధించారు. నియోజకవర్గంలో గెలుపోటములను నిర్దేశించారు. వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు కేవలం 2100 ఓట్లతో మాత్రమే విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి స్వల్ప మెజార్టీతో ఓటమి చవిచూశారు. త్రిముఖ పోటీలో మాత్రమే వైసీపీ గట్టెక్కగలిగింది. అందుకే వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉన్నా.. లేకున్నా జనసేన ఈ నియోజకవర్గంలో పట్టుబిగించే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పసుపులేటి రామారావు జనసేన అభ్యర్థిగా పోటీచేశారు. వాస్తవానికి ఇక్కడ పార్టీ అభివృద్ధికి విడివాడ రామచంద్రరావు ఎంతగానో కృషిచేశారు. పార్టీ టిక్కెట్ ను ఆశించారు. కానీ చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన పసుపులేటి రామారావు తన్నుకుపోయారు. రాజకీయ సమీకరణల దృష్ట్యా రామారావుకు టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చిందని పవన్ చెప్పడంతో రామచంద్రరావు సైడయ్యారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషిచేశారు. జనసేనకు 31 వేల ఓట్లు రావడానికి కారణమయ్యారు. కానీ జనసేన నుంచి పోటీచేసిన రామారావు అధికార పార్టీ గూటికి చేరారు. రామచంద్రరావు పార్టీలో కొనసాగుత వస్తున్నారు.
అయితే దీనినే గుర్తుపెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ నియోజకవర్గ రివ్యూలో రామచంద్రరావుకు క్షమాపణ చెప్పారు. అయితే నాలుగు గోడలతో చెబితే సరిపోదని భావించి.. తణుకు బహిరంగ సభలో సైతం రామచంద్రరావుకు క్షమాపణ కోరారు. గత ఎన్నికల్లో పోటీచేసిన వ్యక్తి వెళ్లిపోయినా.. పార్టీ పట్ల నిబద్ధతో మీరు వ్యవహరిస్తున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని పవన్ స్పష్టం చేశారు. పార్టీ అధినేత క్షమాపణ కోరడంతో రామచంద్రరావు ఒక్కసారిగా నీరుగారిపోయారు. పవన్ ఔన్నత్యాన్ని జన సైనికులు తమ హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు.