Panchkarla Ramesh Babu : జనసేనలోకి ఆ కీలక నేత.. ఆ నియోజకవర్గం ఫిక్స్ చేసిన పవన్

రెండుసార్లు ఎమ్మెల్యేగా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల అనుచరులు విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. అటువంటి వారు జనసేన కండువా కప్పుకోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Written By: Dharma, Updated On : July 15, 2023 11:14 am
Follow us on

Panchkarla Ramesh Babu : వైసీపీకి ఝలక్ ఇచ్చిన పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన పవన్ సమక్షంలో కండువా మార్చుకోనున్నట్టు సమాచారం. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రెండు రోజుల కిందటే పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాలుగా వైసీపీలో కొనసాగుతున్నా హైకమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ హామీ కూడా ఇవ్వలేదు. అందుకే ఆయన వైసీపీని వీడారు.

నెల రోజుల కిందటే పంచకర్ల పవన్ ను కలిసినట్టు ప్రచారం జరిగింది. అప్పటి నుంచే ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరుతారని టాక్ నడిచింది. వైసీపీలో చేరినప్పుడు ఎమ్మెల్యే టిక్కెట్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మొండిచేయి చూపారు. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఆయన వైసీపీకి గట్టి దెబ్బ వేయాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది సవాల్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన అయితేనే టిక్కెట్ వచ్చే అవకాశముండడంతో ఆ పార్టీలో చేరేందుకు దాదాపు డిసైడ్ అయ్యారు.

పంచకర్ల రమేష్ బాబు భీమిలి నియోజకవర్గంపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఇక్కడ కాపు సామాజికవర్గం ఎక్కువ. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయ్యారు. పంచకర్లను టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకెళ్లింది అవంతి శ్రీనివాసరావే. కానీ ఇప్పుడు అవంతి పరిస్థితి ఏమంత బాగాలేదు. అందుకే వైసీపీలో ఉండడం దండగ అన్న నిర్ణయానికి వచ్చిన రమేష్ బాబు జనసేనలో చేరాలని ఒక నిర్ణయానికి వచ్చారు.

పొత్తులు ఉన్నా, లేకపోయినా జనసేనకు భీమిలి నియోజకవర్గం అనుకూలమని వివిధ సర్వేల్లో తేలింది. అందుకే అక్కడ నుంచి బరిలో దిగితే విజయం సునాయాసమని పంచకర్ల భావిస్తున్నారు. సరైన ముహూర్తం ఫిక్స్ చేసుకొని పవన్ సమక్షంలో జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే పంచకర్ల రమేష్ బాబుతో పాటు చాలా మంది నాయకులు జనసేనలో చేరడానికి ముందుకొస్తున్నట్టు సమాచారం. రెండుసార్లు ఎమ్మెల్యేగా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల అనుచరులు విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. అటువంటి వారు జనసేన కండువా కప్పుకోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.