Google CEO Sundar Pichai: ఈ వ్యాపారమైనా సప్లై, డిమాండ్ సూత్రంగా నడుస్తుంది. డిమాండ్ అధికంగా ఉంటే సప్లై తన విధానాలు మార్చుకుంటుంది. వినియోగదారులకు మరింత మెరుగ్గా సేవలు అందించాలి అనుకుంటుంది. ఇది గూగుల్ కు కూడా వర్తిస్తుంది.. యూరప్, అమెరికన్ దేశాల్లో ఆర్థిక మాంద్యం తారాస్థాయికి చేరింది. అంతటి గూగుల్ సంస్థ కూడా పదివేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో పాశ్చాత్య దేశాల్లో కోల్పోయిన మార్కెట్ ను ఇతర దేశాల నుంచి భర్తీ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. వీటిల్లో గూగుల్ కు ఆశాజనకంగా కనిపిస్తున్న దేశం భారత్. పైగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భారతీయుడే కావడంతో తన ప్రణాళికలను అమలు పెట్టడం మొదలుపెట్టింది.

ఏం చేస్తుందంటే
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్.. ఇది 100కు పైగా భారతీయ భాషల్లో వాయిస్, టెక్స్ట్, సెర్చ్ ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉంది.. భారతదేశంలో సాంకేతికంగా అద్భుతమైన మార్పులు వస్తున్నాయి.. చిన్న వ్యాపారాల నుంచి స్టార్టప్ ల వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుతున్నాయి.. సైబర్ సెక్యూరిటీ విషయంలోనూ ఎవరూ రాజీపడటం లేదు. ఈ క్రమంలో ఈ రంగాలపై గూగుల్ భారీగా ఫోకస్ చేసింది.. వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం పెరిగిన నేపథ్యంలో వీటిపై కూడా సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ రంగాల్లో భారీగా లాభాలు గడించే అవకాశాలు కనిపిస్తుండడంతో వచ్చే పదేళ్లలో సుమారు 1000 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఇండియా డిజిటలైజేషన్ ఫండ్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాదు కొత్త మార్గాల్లో సంస్థ అందిస్తున్న తోడ్పాటును గూగుల్ ఫర్ ఇండియా ద్వారా సమీక్షిస్తున్నది. వందకు పైగా భారత భాషల్లో వాయిస్, టెక్స్ట్, సెర్చ్ కు వీలు కల్పించేలా సింగిల్, యూనిఫైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అభివృద్ధి చేస్తున్నది.. ప్రపంచంలో అధికంగా మాట్లాడే వెయ్యి భాషల్లో ఆన్లైన్ సెర్చ్ కు అవకాశం కల్పించడంతోపాటు, ప్రజలు తమ స్థానిక భాషలోనే విజ్ఞాన సముపార్జన, సమాచార సేకరణకు అవకాశం కల్పించాలన్న ప్రయత్నంలో భాగంగా భారతదేశంలో వందకు పైగా భాషల్లో సెర్చ్ ఆప్షన్ ను అందుబాటులోకి తేనుంది.
డిజి లాకర్ యాప్
కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాకుండా నేషనల్ ఈ _గవర్నెన్స్ డివిజన్ తో గూగుల్ జట్టు కట్టింది. ఈ భాగస్వామ్యం ద్వారా త్వరలో అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో డిజి లాకర్ యాప్ ను ప్రీ_ ఇన్ స్టాల్ యాప్ గా అందించనుంది. గూగుల్ తన ఫైల్స్ ఆప్ తో దీనిని అనుసంధానించనుంది.. ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను డిజిటల్ రూపంలో దాచుకునేందుకు వీలుగా డిజి లాకర్ అప్లికేషన్ ను అభివృద్ధి చేసింది.

మహిళలు సారథ్యం వహిస్తున్న ఆరంభ దశ స్టార్టప్ లలో గూగుల్ కూడా పెట్టుబడులు పెట్టనుంది. ఐడీఎఫ్ లో కేటాయించిన 30 కోట్ల డాలర్లలో 25% మహిళ సారధ్య స్టార్టప్ ల్లో పెట్టుబడిగా పెడుతున్నట్టు గూగుల్ ప్రకటించింది. ఇవే కాకుండా రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి దేశీయ టెలికాం దిగ్గజాల్లో మైనారిటీ వాటాలను గూగుల్ కొనుగోలు చేసింది. భాష తర్జుమా తో పాటు సెర్చ్ టెక్నాలజీ మరింత మెరుగుపరిచేందుకు దేశంలోని 773 జిల్లాల నుంచి స్పీచ్ డేటాను సేకరించేందుకు బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తో గూగుల్ జట్టు కట్టింది. భారత తొలి రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సెంటర్ ను ఐఐటి మద్రాసులో ఏర్పాటు చేసేందుకు 10 లక్షల డాలర్ల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించింది. సో ఇప్పట్లో బయటి మార్కెట్లు కోలుకునే అవకాశం కల్పించకపోవడంతో మిగతా కంపెనీల కంటే ముందుగానే గూగుల్ ప్రత్యామ్నాయాలు చూసుకుంది. అందుకే భారత్ వైపు బాగా ఫోకస్ చేసింది. ముందుగానే మనం చెప్పుకున్నాం కదా. సప్లై, డిమాండ్ అని. ఇది ఏ సంస్థకైనా వర్తిస్తుంది. ఇందుకు గూగుల్ ఏం మినహాయింపు కాదు.