
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలు 150 వ రోజుకు చేరుకున్నాయి. మన అమరావతి మన రాజధాని నినాదంతో రైతులు దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి నిర్మాణం జరుగుతున్న సమయంలో నిర్మాణ పనులు నిలిపివేసి, ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం ఉందంటూ ప్రకటన చేసింది.
దీంతో రాజధాని కోసం భూములు కోల్పోయిన రైతులు ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా జరుగుతున్న ఈ ఆందోళనను ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేసింది. అయినా దృఢ సంకల్పంతో దీక్షలు కొనసాగిస్తున్నారు. పోలీసుల కేసులకు వెనక్కి తగ్గకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కోవిడ్ 19 కారణంగా ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ ఇళ్లల్లోనే దీక్షలు చేసి తమ నిరసన తెలియజేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించి రైతుల మనోభావాలకు విలువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని ఉద్యమం 150 రోజులకు చేరిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి నిరసన తెలియజేయనున్నారు.
మరోవైపు ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కి తగ్గడం లేదు. మూడు రాజధానుల ఏర్పాటుకు తెచ్చిన బిల్లు శాసనమండలిలో ఆమోదానికి నోచుకోలేదు. మరోవైపు అమరావతి శాసన రాజధానిగా కొనసాగిస్తామని చెప్పుకొస్తోంది. శాసన రాజధాని వల్ల ఈ ప్రాంతానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ వివాదం ఇలా ఉండగా విశాఖ నగరానికి 20 లారీలలో సీఎం క్యాంపు కార్యాలయ ఫర్నిచర్ విజ్ఞాన్ కళాశాల సమీపంలో ఉన్న ఒక ప్రదేశానికి తరలించింది. అయితే హైకోర్టులో రాజధాని రైతులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సమయంలో బిల్లుకు ఆమోదం లభించే వరకూ తరలింపునకు చర్యలు చేపట్టమని చెబుతోంది. ఈ నేపథ్యంలో రాజధాని రైతుల కోరిక నెరవేరుతుందా అనే సందేహం కలుగుతోంది. ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంభిస్తుందని విపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. రాజధాని రైతులు మాత్రం అమరావతినే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.