CM KCR: తరచూ నియోజకవర్గాలు మారి పోటీ చేసే అలవాటు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కూడా అదే విధానాన్ని కొనసాగించనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం ఇస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి గుడ్ బై చెప్పనున్నారు. ఇందులో భాగంగానే నల్లగొండ లేదా మహబూబ్ నగర్ జిల్లాలలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి పోటీ చేసే అవకాశం ఉందని భారత రాష్ట్ర సమితి నాయకులు చెబుతున్నారు.
ఎందుకు ఈ మార్పు
ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రికి పోటీగా ఎవరూ లేరు. మొన్నటిదాకా ఆ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యర్థిగా నిలిచిన ఒంటేరు ప్రతాపరెడ్డి భారత రాష్ట్ర సమితిలో చేరారు. ప్రస్తుతం ఆయన అటవీ అభివృద్ధి శాఖకు చైర్మన్ గా పని చేస్తున్నారు. అయితే ప్రతాపరెడ్డి భారత రాష్ట్ర సమితిలో చేరినప్పుడే ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గాన్ని ప్రతాపరెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నల్లగొండ లేదా మహబూబ్ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పోర్టు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఆ జిల్లాలకు ఎందుకు
మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలో భారత రాష్ట్ర సమితి ఎదురీదుతున్నట్టు సీఎం కేసీఆర్ కు సమాచారం ఉంది. ఇంటెలిజెన్స్ నివేదిక కూడా దీనినే స్పష్టం చేయడంతో ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందుగానే అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఈ జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ సామాజిక వర్గం అధికార పార్టీ నేతల మీద ఆగ్రహంగా ఉంది. అయితే ఈ ఆగ్రహం తన పార్టీ పుట్టి ముంచక ముందే జాగ్రత్త పడాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు.. ఇందులో భాగంగానే ఈ జిల్లాల్లో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కెసిఆర్ భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి పోటీ చేస్తే
“ఇక కెసిఆర్ అంతటి స్థాయి వ్యక్తి పోటీ చేస్తే ఆ జిల్లాలో అసమ్మతి నాయకులు మొత్తం దారిలోకి వస్తారు. దీనివల్ల ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఉండదు. అలాంటప్పుడు పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అవుతుంది” అని భారత రాష్ట్ర సమితి కీలక నాయకులు చెబుతున్నారు. ఈ జిల్లాల్లో భారీగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో కనుక ముఖ్యమంత్రి పోటీ చేస్తే కేడర్ చెక్కుచెదరకుండా ఉంటుంది. అలాంటప్పుడు పార్టీ అభ్యర్థులు ఏకపక్షంగా గెలిచే అవకాశం ఉంటుంది.. అయితే ప్రతి పార్టీల్లో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం ఇస్తున్న రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ కావడంతో.. ఆ జిల్లా నుంచే ముఖ్యమంత్రి కూడా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీని పట్ల అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోయినప్పటికీ.. ఈసారి ఎలాగైనా నియోజకవర్గ మారాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.. అయితే ముఖ్యమంత్రి నిర్ణయంతో ఆ రెండు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఒకింత వణికి పోతున్నారు. ఇటీవల నిర్వహించిన పార్టీ అంతర్గత సమావేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తోకలు కత్తిరిస్తానని కెసిఆర్ హెచ్చరించిన నేపథ్యంలో.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తమ స్థానాల మీద బెంగ పట్టుకుంది. ముఖ్యంగా నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఇంకాస్త ఎక్కువ ఉంది. ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే భారత రాష్ట్ర సమితిలో ఒకింత టెన్షన్ వాతావరణం నెలకొంది.