Ticket app: జగన్ అధికారంలోకి వచ్చాక ఓ స్ట్రాటజీతో ముందుకెళుతున్నారు. తన అనుకునే వారి విషయంలో ఓరకంగా, వ్యతిరేకంగా ఉండే వారిపట్ల మరోలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నాదనే విమర్శలను ఎదుర్కొంటోంది. తెలంగాణ సర్కారుకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని టాలీవుడ్ ఏపీకి ఇవ్వడం లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్ ను దారికి తెచ్చుకునే ప్రయత్నాలను సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

దీనికితోడు సినీ పరిశ్రమకు చెందిన వారిలో మెజార్టీ వర్గం తెలుగుదేశంకు అనుకూలంగా ఉందని జగన్ సర్కారు భావిస్తోంది. అలాగే జగన్ సీఎం అయ్యాక టాలీవుడ్ పెద్దలు ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా సీఎంకు శుభాకాంక్షలు తెలిపిన దాఖలాలు లేవు. ఇక సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. వీటన్నింటిని పరిణగలోకి తీసుకున్న సీఎం జగన్ ఇండస్ట్రీని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ విన్పిస్తోంది.
ఇందులో భాగంగానే ఆన్ లైన్ టికెటింగ్ విధానం ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్ల రేట్లు తగ్గింపు, బెనిఫిట్ షోల రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సినీ పెద్దలు ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని స్వాగతించినప్పటికీ టికెట్ల రేట్లు తగ్గింపు, తదితర విషయాలపై లోలోపల నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో ఇప్పటికే ఇండస్ట్రీ చాలా దెబ్బతిందని ఈ సమయంలో టికెట్ల రేట్లను తగ్గించడం భావ్యం కాదంటున్నారు.
ఈక్రమంలోనే పలువురు సినీ పెద్దలు సీఎం జగన్మోహన్ రెడ్డి పలుసార్లు కలిసి విజ్ఞప్తులు చేశారు. అయితే ప్రభుత్వం ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తుండటం పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే టికెట్ల తగ్గింపు జీవో ఇచ్చిన ప్రభుత్వం ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటోంది. మరోవైపు టికెట్ల ఆన్ లైన్ విధానం ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు అందుకు తగిన ఏర్పాట్లను చేయకపోవడం గమనార్హం.
ఏపీలో ప్రభుత్వమే సినిమా టికెట్లను అమ్ముతుందని చట్టం చేసింది. ఏపీఎస్‌ఎఫ్‌డీసీ ద్వారా మాత్రమే అమ్మాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసి చాలారోజులు అవుతున్నా ఇప్పటివరకు సినిమా టికెట్లకు సంబంధించిన పోర్టల్ కానీ, యాప్ కానీ సిద్ధం చేయలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై టాలీవుడ్ నిర్మాతలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
వీటిపై ప్రభుత్వం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. టిక్కెట్లు ప్రభుత్వం అమ్మితే.. ఇక థియేటర్లలో అమ్మరా?.. ఒకవేళ వాక్ ఇన్ టిక్కెట్ కౌంటర్లు ఉంటే అందులో ఉద్యోగుల్ని ప్రభుత్వం పెట్టి నడిపిస్తుందా? రోజువారీ కలెక్షన్లు ఎప్పుడు జమ చేస్తారు..? వంటి సమస్యలకు పరిష్కారం చూపించాల్సి ఉంది.
అయితే ఇప్పటి దాకా ప్రభుత్వం నుంచి పోర్టల్ రెడీనే కాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం అధికారం ఉంది కాదా? అని హడావుడిగా జీవోలు ఇచ్చేసింది. దీంతో ప్రభుత్వం కేవలం ఇండస్ట్రీని బ్లాక్ మెయిల్ చేసేందుకు ఇలాంటి ఎత్తుగడ వేసిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. జగన్ సర్కార్ ఇకనైనా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చి సినీ ఇండస్ట్రీలోని సమస్యలను సైతం పరిష్కారించాలని పలువురు కోరుతున్నారు.