ప్రజల చేత.. ప్రజల కోసం ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులు పత్తా లేకుండా పోయారు. ఎన్నికల సమయంలో మేముంటామంటూ..మీ కష్టాలు తీరుస్తామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు ఇప్పుడు కంటికి కనిపించకుండా పోయారు. కరోనా మహమ్మారితో ప్రజలు అవస్థలు పడుతుంటే కనీస ఆప్యాయతను పంచనా నాయకులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కరోనా కోరల్లో చిక్కుకున్న రాజధాని ప్రజలను ఆదుకునేందుకు ఒక్క ప్రజాప్రతినిధి కనీస చేయూతనివ్వకపోవడం శోచనీయం.
తెలంగాణలో కరోనా ప్రవేశించిన మొదటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్లోనే వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నారు. దీంతో సామాన్య ప్రజల నుంచి ధనికుల వరకు అందరూ అవస్థలు పడుతున్నారు. కొందరు వైరస్ బారిన పడి కొట్టుమిట్టాడుతుంటే సామాన్యులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇక ఇక్కడేం చేయలేని కొందరు తమ సొంతూళ్లకు వలస వెళ్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో మేమున్నాంటూ ఒక్క నాయకుడు ముందుకు రాకపోవడం దారుణమని కొందరు ఆరోపిస్తున్నారు.
సోనూసుద్ లాంటి సినీ నటుడు ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంటే.. ప్రజల కోసం ఎన్నుకోబడిన నాయకులు మాత్రం గడపదాటి బయటకు రావడం లేదు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రాణాలకు తెగించి తమకు తోచిన సాయం చేస్తున్నారు. కానీ జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్క కార్పొరేటర్ తమ కాలనీవాసుల బాగోగులు అడిగిన సంఘటన లేదని కొందరు వాపోతున్నారు. గత ఏడాది కరోనా కాలంలోనూ తమకు ఓట్లేయమని ఇంటింటికి తిరిగిన నాయకులు పదవి వచ్చాక మాత్రం ఇంట్లో నుంచి బయటకు రావడం లేదని అంటున్నారు.
కొన్ని రోజుల కిందట మేయర్ విజయలక్ష్మి కార్పొరేటర్లతో వర్చువల్ మీటింగ్ పెట్టి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఇంతవరకు ఆ మీటింగ్ పెట్టింది లేదని అంటున్నారు. అయినా 150 మంది కార్పొరేటర్లతో కలిసి వర్చువల్ మీటింగ్ సాధ్యమా..? అని అంటున్నారు. కరోనా వైరస్ తో జీహెచ్ఎంసీ అతలాకుతలమవుతోంది. అయితే వైరస్ బారిన పడిన వారికి కనీస సేవలకు కార్పొరేటర్లు ముందుకు రాకపోవడంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.