రాజులు, రాజ్యాలు పోయాయి. కానీ వారి రాజరికం మాత్రం ఇంకా ఉంది. వారి పరిపాలన వైభవం మన కళ్లముందే కనిపిస్తోంది. వారు కట్టిన కోటలు, గుడులు, విద్యాలయాలు, తటకాలు, చెరువులు, ఆస్తానాలు, ఘనమైన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. విజయనగర జిల్లా కేంద్రంగా పాలించిన ‘పూసపాటి’ గజపతిరాజుల ఘనత కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయాలతో లిఖించబడింది..
-పూసపాటి వంశ చరిత్ర ఇదీ
పూసపాటి రాజులది ‘సూర్యవంశం’. వారిది ‘వశిష్ట గోత్రం’. చరిత్రకారులు చెబుతున్న ప్రకారం.. క్రీ.శ.514లో దక్షిణ భారతదేశంలో ‘మాధవ వర్మ’ నాయకత్వంలో ‘వశిష్ట’, ధనుంజయ, కౌండిన్యా, కశ్యప గోత్రాలు గల నాలుగు ముఖ్యమైన రాజవంశీయుల పాలన కొనసాగిందని చెబుతుతారు.
-మొదటి రాజు: పూసపాటి పెద విజయరామరాజు(1708-1757)
పూసపాటి వంశంలో తొలిరాజుగా పూసపాటి పెద విజయరామరాజు కీర్తికెక్కారు. ఈయన విజయనగరం జిల్లా కేంద్రంగా 1708 నుంచి 1757 వరకు పాలించారు. ఈయన తండ్రి మహారాజా ఆనందరాజు ‘విజయపురి’కి పునాది వేశారు. ఆ తర్వాత ఇది విజయనగరంగా మారింది. వారి పరిపాలన కేంద్రంగా రూపుదిద్దుకుంది.
-పూసపాటి ఆనందరాజు (1732-1760)
పూసపాటి ఆనందరాజుకు ఘనమైన పోరాట చరిత్ర ఉంది. ఈయన ఫ్రెంచ్ వారి నుంచి విశాఖపట్నం కోటను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. బ్రిటీష్ వారి సహకారంతో వారిని ఇక్కడి నుంచి తరిమివేశాడు.
-పూసపాటి చిన్న విజయరామరాజు (1748-1794)
విజయనగరానికి చెందిన మహారాజ పూసపాటి చిన్న విజయరాజు 1748 నుంచి 1794 వరకు పాలించారు. తన భారీ సైన్యంతో యుద్ధంలో పోరాడుతూ యుద్ధరంగంలో 1794 జూలై 10న ప్రాణాలు కోల్పోయాడని చరిత్ర చెబుతోంది.
-పూసపాటి నారాయణ గజపతిరాజు (1786-1845)
పూసపాటి నారాయణ గజపతిరాజు 1786 నుంచి 1845 వరకు విజయనగరాన్ని పాలించాడు. ఈయనను నారాయణ బాబు అని కూడా పిలుస్తారు. ఈయన తన జీవితంలో ఎక్కువ భాగం వారణాసిలో గడిపాడు. 1800లో విజయనగరానికి చెందిన మహారాజు వారణాసిలో కేదర్ ఘాట్ , విజయనగరం ఘాట్ ను ఈయనే నిర్మించాడు.
-పూసపాటి విజయరామ గజపతిరాజు (1826-1879)
పూసపాటి విజయరామ గజపతిరాజు 1826-1879 వరకు విజయనగరాన్ని పాలించాడు. విజయనగరాన్ని విద్యా కేంద్రంగా మార్చిన ఘనత విజయరామ రాజు సొంతం. ఈయన పాలనలోనే రహదారులు, విజయనగరంలో పాఠశాలలు వంటి అభివృద్ధి పనులు కూడా చేసి ప్రజలకు ఎన్నో ఉపయోగపడే పనులు చేశాడు.
-పూసపాటి ఆనందగజపతిరాజు (1850-1897)
పూసపాటి ఆనంద గజపతిరాజు పాలనలో బ్రిటీష్ వారు ఈయనకు బిరుదులు ప్రదానం చేశారు. మంచి పాలన దక్షుడిగా పేరుంది. ‘మన్నాయ్ సుల్తాన్ బహదూర్ ఆఫ్ విజయనగరంగా కీర్తిని పొందాడు.
-పూసపాటి విజయరామ గజపతిరాజు -IV (1883-1922)
పూసపాటి విజయరామ గజపతిరాజు -IV విజయనగరంలో ‘శ్రీ విజయరామ గణ పాఠశాల’ను శ్రీ ఆదిభట్ల నారాయణ దాస్ తో మొదటి ప్రిన్సిపల్ గా నియమించి విద్యాదానం చేశాడు. ఈయన పాలనలో విద్యావైద్యంకు పెద్దపీట వేశారు.
-పూసపాటి అలక నారాయణ గజపతిరాజు -IV (1902-1937)
పూసపాటి అలక నారాయణ గజపతిరాజు -IV ‘అలకనంద ప్యాలెస్’ను నిర్మించాడు. ప్రస్తుతం ఇది పోలీస్ బెటాలియన్ గా ఉంది. విజయనగరం ప్యాలెస్ పక్కనే ఒక విమానాశ్రయం రన్ వేను కూడా ఈయన నిర్మించాడు. ఈయన పాలనలో అభివృద్ధి పనులు చాలా చేశాడు.
-పూసపాటి విజయరామ గజపతిరాజు (1924-1995)
పూసపాటి విజయరామ గజపతి రాజు స్వాతంత్య్రానికి ముందు పాలించి.. వచ్చాక భారతప్రభుత్వంలో విలీనం అయ్యారు. ఈయనకు రాజారిషి డా.పీవీజీ రాజ గజపతిరాజుగా పేరుంది. ఈయనే పూసపాటి వంశంలో 15వ , చివరి విజయనగరం రాజుగా గుర్తింపు పొందాడు. ఈయన తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంతో విజయనగర సామ్రాజ్యం భారత్ లో విలీనమైంది. ఆ తర్వాత ఈయన భారత్ లో ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గొప్ప పరోపకారిగా పేరొందాడు. విజయనగర రాజ్యానికి చిట్టచివరి యువరాజు ఈ పీవీజీ రాజు 1958లో తమ తండ్రి పేరు మీద ‘మహారాజా అలక్ నారాయణ గజపతి సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్)’ అనే ట్రస్టును నెలకొల్పారు. అంతేకాదు.. తమ ఆస్తులన్నింటిని ఆయన దీని పరిధిలోకి తీసుకొచ్చారు.
ఇక ప్రస్తుతం విజయనగర రాజ వంశానికి పెద్ద దిక్కుగా టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఈయన అన్న ఆనంద గజపతిరాజు మరణంతో విజయనగర రాజవంశంలో అశోక్ గజపతికి అధికారం దక్కింది. వీరి సారథ్యంలో ‘మాన్సాస్ ట్రస్ట్ సహా, సింహాచలం ధర్మకర్తలుగా వీరు కొనసాగుతున్నారు. పలు ఆలయాలపై వీరి ఆధిపత్యం ఉంది. వేల ఎకరాల మాన్యం, భూములు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్నాయి. పూసపాటి వంశీయులకు చెందిన ఆస్తుల్లో అత్యంత విలువైనవి భూములే. స్వాతంత్ర్యం వచ్చాక పీవీజీరాజు తమకున్న వేల ఎకరాల భూములను దేవాలయాలు, వాటి ధూపదీప నైవేద్యాల కోసం దేవాదాయశాఖకు అప్పగించారు. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం దేవస్థానానికి దాదాపు 13వేల ఎకరాల భూములు, 108 ఉపాలయాలు వచ్చి చేరాయి. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ ఈ దేవాలయాలకు పూసపాటి వంశీయులే అనువంశిక ధర్మకర్తలుగా ఉంటున్నారు. మొదటి నుంచి సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ రెండింటికీ చైర్మన్ గా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. తొలుత పీవీజీ రాజు, ఆయన తర్వాత ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజులు అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరించారు.
-పూసపాటి రాజులు చేసిన దానధర్మాలు
పూసపాటి వంశానికి చెందిన రాజులు ప్రజలకు ఎంతో సేవ చేశారు. ధానధర్మరాలు చేశారు. రోడ్లు, మౌళిక వసతులు కల్పించారు. బావులు, తటకాలు తవ్వించి వ్యవసాయానికి ఊపిరిపోసారు. ప్రధానంగా విద్యావ్యవస్థకు ఊపిరిలూదారు. పూసపాటి విజయరామ గజపతిరాజు 1860లో సంస్కృత కళాశాలను ఆ తర్వాత సంగీత కళాకాలను నెలకొల్పారు. అలాగే 1879లో మహారాజా అటానమస్ కళాశాలను నెలకొల్పి ఇంటర్మీడియెట్ విద్యాకు పునాదులు వేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజులు ఈ కశాశాలలు అన్నింటిని ప్రభుత్వానికి అప్పగించారు. విజయనగర రాజ్యానికి చిట్టచివరి యువ రాజు పీవీజీ రాజు 1958లో తమ తండ్రి పేరు మీద ‘మహారాజా అలక్ నారాయణ గజపతి సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్)’ అనే ట్రస్ట్ ను నెలకొల్పారు. తమ ఆస్తులన్నింటిని ఆయన దీని పరిధిలోకి తీసుకొచ్చారు. తమ పూర్వీకులు నిర్మించిన కోటనూ, అందులోని భవనాలను విద్యాసంస్థల నిర్వహణకు ఇచ్చేశారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతోపాటు , తమిళనాడు, ఒడిషా రాష్ట్రంలోనూ విజయనగర సంస్థానానికి అనేక ఆస్తులున్నాయి. గజపతిరాజులు స్థాపించిన పాఠశాలలు, కళాశాలల ద్వారా వేలమంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.వందలమంది ఉద్యోగులు ఈ సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు. అలా సామాజికంగా, రాజకీయంగా, సేవల పరంగా గజపతిరాజులు ఎంతో కృషి చేశారని చెప్పొచ్చు.
అనాదిగా పూసపాటి వంశీయులు విజయనగరం జిల్లాలో రాజకీయంగా కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లా రాజకీయాలను శాసించేలా ఎదిగారు. అశోక్ గజపతిరాజు గత చంద్రబాబు హయాంలో బీజేపీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా కూడా కొనసాగారు. ప్రస్తుతం ఈయనే విజయనగర మాన్సాస్ ట్రస్ట్ కు చైర్మన్ గా కొనసాగుతున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Genealogy of poosapati gajapati rajas
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com