Gautam Adani: భారత దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, పన్నుల భారంతో పేదోడు మరింత పేదోడుగా మారుతుంటే ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో చేరుతున్నారు. ప్రధాని మోదీ స్నేహితుడుగా గుర్తింపు ఉన్న గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్ అధినేత నికర సంపదలో అత్యంత వేగంగా దూసుకెళ్తున్నారు. ఆరు నెలల్లోనే ఆయన సంపద ఆరు రెట్లు పెరిగి ప్రపంచ కుబేరుల జాబితాలో చేరారు. తాజాగా ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి ఎగబాకారు. సంపద విలువ పరంగా ఆయన కంటే ముందు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాత్రమే ఉన్నారని ఫోర్బ్స్ రియల్–టైమ్ బిలియనీర్స్ సూచీ వెల్లడిస్తోంది. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్, ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి అదానీ రెండో స్థానానికి చేరుకున్నారు. ఈ స్థాయికి చేరిన తొలి భారత, ఆసియా వ్యక్తి అదానీయే. స్టాక్ మార్కెట్ కదలికలకు అనుగుణంగా కుబేరుల సంపద ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో జాబితాలోని వ్యక్తుల స్థానాల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.
ఫోర్బ్స్ వివరాల ప్రకారం..
అదానీ గ్రూప్ కంపెనీ షేర్లకు స్టాక్ మార్కెట్లో శుక్రవారం డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ షేర్లు కొనుగోలు చేయడంతో ఆయన సంపద 5.5 బిలియన్ డాలర్లు పెరిగింది. 155.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో కుబేరుల జాబితాలో రెండో స్థానానికి చేరారు. విలాస వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 155.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానానికి పడిపోయారు. జెఫ్ బెజోస్ 149.7 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన మరో కుబేరుడు ముకేశ్ అంబానీ 92.3 బిలియన్ డాలర్ల సంపదతో 8వ స్థానంలో నిలిచారు.
ఏడాదిలో 72 బిలియన్ డాలర్ల సంపద..
అదానీ గ్రూప్‌లో మొత్తం ఏడు కంపెనీలు స్టాక్ మార్కెట్లలో నమోదయ్యాయి.
గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ గ్రూప్‌లోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.20.11 లక్షల కోట్లుగా ఉంది. వీటిలో నాలుగు సంస్థల షేరు ధర ఈ కేలండర్ ఏడాదిలో రెండింతలకుపైగా పెరిగింది. ఈ ఏడాది అదానీ సంపద 72 బిలియన్ డాలర్లకు పైగా ఎగబాకింది. అయితే తొలి పది మంది కుబేరుల్లో 2022లో మోదీ మిత్రులు అయిన అదానీ, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంపద మాత్రమే పెరగడం విశేషం. కాగా, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచీలో మాత్రం గౌతమ్ అదానీ మూడో స్థానంలో ఉన్నారు. ఈ సూచీ గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి ఉన్న విలువను పరిగణనలోకి తీసుకుంది. మార్చిలో రెగ్యులేటరీలకు సమర్పించిన వివరాల ప్రకారం.. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్స్లో గౌతమ్ అదానీకి 75 శాతం వాటాలున్నాయి. అదానీ టోటల్ గ్యాస్‌లో 37 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లో 65 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 61 శాతం వాటాలు ఆయన పేరిట ఉన్నాయి.
వజ్రాల వ్యాపారిగా మొదలై..
కళాశాల చదువును మధ్యలోనే ఆపేసిన అదానీ, తొలుత వజ్రాల ట్రేడింగ్ చేశారు. బొగ్గు వ్యాపారిగా మారాకే ఆయన దశ తిరిగింది. బొగ్గు గనులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, డేటా కేంద్రాలు, విద్యుత్ ఉత్పత్తి, సిటీగ్యాస్ పంపిణీ, సిమెంటు తయారీ రంగాలకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి, సంపద విలువను అనూహ్యంగా పెంచుకున్నారు.
Also Read: Prabhas- Rajnath Singh: ప్రభాస్ ఫ్యామిలీని పరామర్శించిన రాజ్ నాథ్ సింగ్
రెండేళ్లలో అదానీ షేర్లు వెయ్యి రెట్లు..
అదానీ గ్రూప్‌నకు చెందిన కొన్ని షేర్లు 2020 నుంచే 1000 శాతానికి పైగా లాభాలు అందించాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అదానీ అవతరించారు. ఏప్రిల్ కల్లా సంపద విలువ 100 బిలియన్ డాలర్లకు చేరడంతో, మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానానికి చేరారు. తాజాగా జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి ఇపుడు రెండో స్థానానికి చేరారు.
నల్ల ధనం అంతా వారిఖాతాల్లోకే వెళ్తోందా?
దేశంలో నల్లధనం పెరిగిపోయిందని.. అవన్నీ తీసుకొచ్చి ప్రతీ పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తానని 2014 ఎన్నికల ముందుర ప్రధాని నరేంద్రమోదీ అతిపెద్ద హామీనిచ్చాడు. భారత కరెన్సీ విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్నట్లు పేర్కొన్నారు. ఆ నల్ల ధనాన్ని భారత దేశానికి రప్పించేందుకు 2016లో పెద్దనోట్లు రద్దు చేశారు. విదేశాల నుంచి వచ్చే నల్లధనాన్ని పేదల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమచేస్తానని అన్నారు. కానీ అది జరుగలేదు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో నల్లధనం వెనక్కి రాలేదు కానీ అదానీ, అంబానీ మాత్రమే సంపన్నులుగా మారుతున్నారు. పెరుగుతున్న ధరలతో పేద, మద్య తరగతి ప్రజల బతుకులు చిన్నాభిన్నం అవుతున్నాయి. దీంతో ‘‘నల్లధనం తెచ్చి మోదీ పేదల ఖాతాల్లో కాకుండా అదానీ, అంబానీ ఖాతాల్లోనే వేస్తున్నారా ఏంటి?’’ అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ప్రైవేటీకరణ.. వారికి సంపద..
ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాలు అంబానీ, అదానీకి సంపదగా మారుతున్నాయన్న ఆరోపణలున్నాయి. నష్టాల పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్మేస్తోంది. ఇప్పటికే ఎయిర్‌లైన్స్, విమానాశ్రయాలను ప్రైవేటీకరించింది. ఇది అదానీకి కలిసి వచ్చింది. ముంబయ్ విమానాశ్రయాన్ని దక్కించుకున్నారు. ఇక స్పెక్ట్రం వేలం ప్రభుత్వం టెలికం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ను నిండా ముంచింది. ఈ నిర్ణయం అంబానీకి ఆదాయం సమకూరుస్తోంది. 4జీ నెట్‌వర్క్‌తో టెలికం రంగంలోకి అడుగు పెట్టిన అంబాని ఒక సంచలనమయ్యారు. కోట్ల సంపదను కొల్లగొట్టారు. తాజాగా 5జీ వేలంలోనూ అదానీ, అంబానీ పాల్గొన్నారు. మరోవైపు రైల్వే, ఎల్ఐసీలో వాటాల విక్రయం కూడా సంపన్నులకు లాభాం చేకూరుస్తోంది. ఈ నిర్ణయాలతో సామాన్యులకు మాత్రం ఒరిగింది ఏమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా మోదీ సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణ నుంచి మాత్రం తగ్గేదేలే అంటున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Gautam adani becomes 2nd worlds richest person
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com