కరీంనగర్ కేంద్రంగా గ్రానైట్ వ్యాపారం కొనసాగుతోంది. కోట్లాది రూపాయల విలువైన గ్రానైట్ ను ఇతర దేశాలకు రవాణా చేస్తున్నారు. ప్రకృతిని దోచుకుని పర్యావరణాన్ని సర్వ నాశనం చేస్తున్నారు. దీనిపై గతంలో కూడా ఎన్నో ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జిల్లాలో 9 గ్రానైట్ కంపెనీలు విచ్చలవిడిగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాయి. దీనిపై ఎంపీ ఫిర్యాదు చేశారు. నియమ నిబంధనలకు విరుద్దంగా వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఈడీ బృందం సదరు కంపెనీలకు నోటీసులు అందజేసింది. నోటీసులు అందుకున్న కంపెనీల్లో మంత్రి గంగుల కమలాకర్ కు చెందిన శ్వేతా ఏజెన్సీస్ సైతం ఉండడం గమనార్హం.
కరీంనగర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో నిక్షిప్తమైన గ్రానైట్ నిక్షేపాలను పలు కంపెనీలు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. కోట్లాది రూపాయలు గడిస్తున్నాయి. 2019లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గ్రానైట్ అక్రమ తరలింపుపై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ కు చెందిన సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, న్యాయవాది భేతి మహేందర్ రెడ్డి ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేశారు.
దీంతో ఈడీ కరీంనగర్ లోని తొమ్మిది గ్రానైట్ ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసింది. ఆయా ఏజెన్సీలు ఎంత పరిమాణంలో గ్రానైట్ ను విదేశాలకు ఎగుమని చేస్తున్నాయో చెప్పాలని సూచించింది. ఆయా ఏజెన్సీలపై ఫెమా నిబంధనలు కూడా అమలు చేసే అవకాశం ఉంది. దీనిపై ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాము నిబంధనలకు అనుగుణంగానే మైనింగ్ వ్యాపారం చేస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం.
అయితే గ్రానైట్ అవకతవకలపై ఎంపీ బండి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారించిన సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని తెలిపారు. దీంతో మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. వాస్తవానికి ఈ కేసుల ఇంకా నిజానిజాలు తేలలేదని తెలుస్తోంది. పెండింగులో ఉన్న కేసుపై మంత్రి సానుకూలంగా మాట్లాడడంపై విమర్శలు వస్తున్నాయి. ఆయన మాటలతో కేసు ఎటు వైపు వెళుతుందో అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి.