
Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఉమేష్ పాల్ హత్య కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ వేదికగా చెప్పిన “మిట్టి మే మిలా దేంగే” మాటలను నిజం చేశాడు. తాజాగా గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఉమేష్ పాల్ హత్య కేసును అత్యంత కీలకంగా తీసుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అసద్ కోసం రాష్ట్రాన్ని 50 రోజుల పాటు జల్లెడ పట్టారు.. చివరకు గురువారం ఝాన్సీలో అతడిని అంతమొందించారు.
ఫిబ్రవరి 24న ప్రయాగ్రాజ్ లో ఉమేష్ హత్యకు గురయ్యాడు. ఆ హత్యను అసద్ దగ్గరుండి పర్యవేక్షించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన సమయంలో అసద్ అక్కడే ఉన్నట్టు .. ఉమేష్ అక్కడి నుంచి పారిపోతుండగా అసద్ వెనుక నుంచి కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఇక అప్పటినుంచి అసద్ పరారీ లో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు 50 రోజులుగా గాలింపు చేపడుతున్నారు. హత్య తర్వాత అసద్ నేపాల్ పారిపోయినట్టు ప్రచారం జరగడంతో .. యూపీ పోలీసులు అక్కడికి కూడా వెళ్ళారు. హత్య తర్వాత అసద్ లక్నో పారిపోయాడు. అక్కడి నుంచి అనేక ప్రాంతాలు తిరిగాడు. తాజాగా అతడు ఝాన్సీ నుంచి మధ్యప్రదేశ్ కు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
మరో వైపు ఉమేష్ హత్య కేసులో విచారణ నిమిత్తం అసద్ తండ్రి ఆతీక్ ను గురువారం ప్రయాగ్రాజ్ కోర్టుకు తీసుకొచ్చారు..అయితే అతీక్ ను తరలించే పోలీస్ కాన్వాయ్ పై దాడి చేసే వారిని తప్పించేందుకు అసద్ కుట్ర చేస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే అసద్ కోసం పోలీసులు ఝాన్సీలో గాలిస్తుండగా.. ఒక బైక్ పై మరో నిందితుడు గుల్హమ్ తో కలిసి వెళ్తూ కనిపించాడు. పోలీసులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. నిందితులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపి వారిని మట్టుపెట్టారు. ఇద్దరు డిఎస్పి ర్యాంకు అధికారుల నేతృత్వంలో 12 మంది బృందం ఈ ఆపరేషన్ లో పాల్గొన్నది. ఎన్కౌంటర్ సమయంలో మొత్తం 42 రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు.
యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫియా మీద ఉక్కు పాదం మోపారు. 2017 మార్చి నుంచి ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు 178 మంది క్రిమినల్స్ ను చంపేశారు. ఇదే కాలంలో 23,069 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. క్రిమినల్స్ జరిపిన ఎదురు కాల్పుల్లో 15 మంది పోలీసులు అమరులయ్యారు. 2020 జూన్ లో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇదే స్థాయిలో ఎన్కౌంటర్ చేశారు.. ఒకవైపు ఎన్కౌంటర్లు జరుగుతుండగానే.. మరోవైపు బుల్డోజర్ మార్పు న్యాయం ఉత్తరప్రదేశ్ వాసులకు యోగి బాబా సుపరిచితం చేశాడు. ఇప్పుడు ఆ బుల్డోజర్లనే యూపీ వ్యాప్తంగా విపరీతంగా వినియోగిస్తున్నాడు. అసద్ ఎన్కౌంటర్ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.