Pawan Kalyan : శతాబ్దాలు దాటుతున్నా మత్స్యకారుల బతుకుల్లో పురోగతి లేదు. సాహస వృత్తిగా నిత్యం అలలతో యుద్ధం చేస్తున్న వారికి స్వాంతన చేకూరడం లేదు. ప్రమాదపుటంచున బతుకు కోసం ఆరాటపడే క్రమంలో రాకాసి అలలకు బలి అవుతున్నా పాలకులకు కనువిప్పు కలగడం లేదు. స్థానికంగా వేట గిట్టుబాటుకాక.. పొట్ట చేతపట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నా వారిని చేయి పట్టుకొని నియంత్రించేందుకు ప్రయత్నించడం లేదు. స్థానికంగా ఉపాధి మెరుగుపరిచేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదు. వారు నమ్మి అడుగులేసిన రాజకీయ పార్టీలు వారిని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నాయి. సంక్షేమ పథకాలను ఎరగా చూపి శాశ్వత ప్రాజెక్టులు, పథకాలను పక్కనపడేస్తున్నాయి. వారిని దారుణంగా వంచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, మత్స్యకార యువత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై నమ్మకం పెట్టుకున్నాయి. పవన్ అయితేనే తమకు న్యాయం చేయగలరని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఏపీ సొంతం. దేశంలో ఎక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రంలో ఏపీ రెండోది. దేశవ్యాప్తంగా 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే.. ఏపీలో 974 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయినా మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు లేవు. తరాలు మారుతున్నా వారి బతుకుల్లో మార్పులు లేవు. మంచి చదువులు లేవు. పక్కా ఇల్లు ఉండదు. వేట గిట్టుబాటు కాదు. వ్యయప్రయాసలకోర్చి పట్టుకున్న మత్స్యసంపదకు మార్కెట్ ఉండదు. రవాణా సౌకర్యం లేదు. కష్టానికి తగినట్టు ప్రతిఫలం ఉండదు. సముద్రంలో చేపలవేట పుణ్యమా అని చిన్న వయసుకే అనారోగ్య సమస్యలు, కంటిచూపు, ఇతరత్రా రుగ్మతలు. కానీ ఇవేవీ పాలకులకు కనిపించడం లేదు. వారిని ఒక ఓటు బ్యాంకుగా మలుచుకున్న పార్టీలు వారికి శాశ్వత ప్రయోజనం కల్పించే చర్యలపై దృష్టిపెట్టలేదు. ఈ నేపథ్యంలో గంగపుత్రులు పవన్ కళ్యాణ్ పై ఆశలు పెట్టుకున్నారు.
గత కొద్దిరోజులుగా మత్స్యకారుల జీవన విధానం, వారి వెనుకబాటుతనంపై జనసేన ప్రత్యేక అధ్యయనం చేస్తూ వస్తోంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందితే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయో సమగ్ర ప్రణాళిక రూపొందించింది. మత్స్యకారుల జీవన విధానానికి విఘాతం కలిగించేలా, కార్పొరేట్ సంస్థలకు వెన్నుదన్నుగా నిలిచేలా అనేక జీవోలిచ్చింది. దీనిపై పవన్ ఘాటుగానే స్పందించారు. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. పోరాటానికి సైతం పిలుపునిచ్చారు. గత ఎన్నికల తరువాత వైసీపీ మత్స్యకారులకు ఇచ్చిన చాలా హామీలను తుంగలో తొక్కింది. వాటిపై పోరాటానికి పవన్ పిలుపునిచ్చారు. అటు పార్టీ కీలక నాయకులు ఎప్పటికప్పుడు మత్స్యకార ప్రాంతాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. తాగా ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమంలో మత్స్యకారుల సమస్యలను ఒక అజెండాగా తీసుకొని చర్చించనున్నారు. మత్స్యకార యువత నుంచి అభిప్రాయాలు సేకరించి జనసేన అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను యువశక్తి వేదికగా ప్రకటించనున్నారు.