Gadapa Gadapaki YSRCP: గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం ఫెయిలైంది. మంత్రుల సామాజిక న్యాయభేరి సైతం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలేదు. ప్రజలు ముఖం చాటేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రమాదం తప్పదా? అంటూ సగటు వైసీపీ నాయకులు, కార్యకర్తలకు తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. మూడేళ్లలో చేసిన పనులు చెప్పేందుకు ‘గడపగడపకు వైసీపీ ప్రభుత్వం’ బాట పట్టిన ప్రజాప్రతినిధులకు నిలదీతలు, ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురయ్యాయి. దీంతో కేబినెట్ లోని 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు సామాజిక న్యాయభేరి యాత్రకు సిద్ధమయ్యారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమైన యాత్రకు జన సమీకరణ చేయడం నేతలకు పెద్ద ఇబ్బందిగా మారింది. 17 మంది మంత్రులు వచ్చేసరికే సగానికి పైగా జనం సభా స్థలం నుంచి వెళ్లిపోతున్నారు. పోలీసులు గేట్లు వేసి ఆపాలని చూసినా జనం ఆగలేదు. వాళ్లను తోసుకుంటూ వెళ్లిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం జరిగిన వైసీపీ సామాజిక భేరిలో అయితే చివరకు ఖాళీ కుర్చీలు చూసుకొని మంత్రులు ప్రసంగాలు చేయాల్సి వచ్చింది. పథకాలు ఆపేస్తామని డ్వాక్రా మహిళలను బెదిరగొడుతూ, ఉపాధి పనులు నిలిపివేస్తామని కూలీలను అదరగొడుతూ మంత్రుల సభలను విజయవంతం చేసేందుకు అధికారులు చెమటోర్చుతున్నారు. విశాఖపట్నంలో శుక్రవారం పూర్తిగా డ్వాక్రా మహిళలతో ‘యాత్ర’ సభను లాగించేశారు. విశాఖలో తిరిగి మొదలైన యాత్ర రాజమహేంద్రవరానికి సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంటుందని చెప్పారు. దీనికోసం మధ్యాహ్నం రెండుగంటల నుంచే వివిధ బస్సులలో తీసుకొచ్చి మహిళలు, వృద్ధులను కూర్చోపెట్టారు. కానీ 6 గంటలైనా మంత్రుల బస్సు రాకపోవడంతో జనం తిరుగుముఖం పట్టారు. సుమారు రాత్రి 7 గంటలకు మంత్రుల బస్సు వచ్చింది. అప్పటికే సగం జనం వెళ్లిపోయారు. ఎందుకు జనాన్ని తీసుకొచ్చి ఇబ్బంది పెడతారని పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. ఈ సభ జన సమీకరణకు మండలానికి 15 ప్రైవేట్ బస్సుల వరకూ ఏర్పాటు చేశారు. ఇక, మంత్రుల బస్సుయాత్రతో కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలీసులు షాపులు మూసివేయించారు. బస్సులు కాంప్లెక్స్‌కు రాకుండా దారి మళ్లించారు. కిలోమీటరు నడిచివెళ్లి బస్సు ఎక్కాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మహిళల సమీకరణ..
వైసీపీ మం త్రులు శుక్రవారం గాజువాకలో నిర్వహించిన ‘సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర’ సభలో స్వయం సహాయక సంఘాల సభ్యులే కనిపించారు. సభకు హాజరైన వారిలో 90 శాతానికిపైగా డ్వాక్రా మహిళలే ఉన్నారు. గాజువాక సభకు చుట్టుపక్కల ప్రాంతాల్లో గల ప్రతి రిసోర్స్ పర్సన్ (ఆర్‌పీ) తమ పరిధిలోని మహిళా సంఘాల సభ్యులను తీసుకురావాలని జీవీఎంసీ యూసీడీ అధికారులు ఆదేశించారు. దీంతో ఉదయం ఎనిమిది గంటలకే నాయకులు ఏర్పాటు చేసిన బస్సులు, ఆటోల్లో మహిళలు సభా వేదిక వద్దకు చేరుకున్నారు. సభకు వచ్చిన మహిళలను ఆర్‌పీలు గ్రూపు ఫొటోలు తీసి తమ ఉన్నతాధికారులకు పంపించడం కనిపించింది. బస్సు యాత్రలో మంత్రుల ప్రసంగాలు కూడా ఏమంత ఆకట్టుకునేలా లేవు. కరోనా సమయంలో ఒక్క కుటుంబం కూడా రాష్ట్రంలో కన్నీళ్లు కార్చలేదని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా బిక్క ముఖం వేయాల్సి వచ్చింది.
Also Read: Power Cuts Again AP: మళ్లీ విద్యుత్ కోతలు..భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
ఊసులేని ‘గడపగడప’
సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర పుణ్యమా అని గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం బెడద తప్పిందని వైసీపీ ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు చాలా నియోజకవర్గాల్లో కార్యక్రమం తూతూమంత్రంగా జరిపించారు. ఎక్కడికక్కడే ప్రజలు నిలదీస్తుండడం, మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో గ్రామాల సందర్శనకు నేతలు భయపడ్డారు. కార్యక్రమ నిర్వహణలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమకు సేఫ్ జోన్ గా నిలిచే గ్రామాలను ఎంపిక చేసుకుంటున్నారు. తాజాగా బస్సు యాత్ర పేరిట కొంతమంది ప్రజాప్రతినిధులు తప్పించుకుంటున్నారు. కార్యక్రమానికి జన సమీకరణ పేరుతో గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నారు.
Also Read: 3 Years of Jagan Governance: జగన్ పాలనకు మూడేళ్లు.. ఎన్నో వివాదాలు.. సంక్షేమ ఫలాలు