G20 Summit 2023: భారత్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక జీ20 సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ అధ్యక్షతన జీ20 విస్తరణ జరిగింది. ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇస్తూ ప్రధాని మోదీ∙చేసిన ప్రతిపాదనకు సభ్యులందరి ఆమోదం లభించింది. దీంతో జీ20లో ఆఫ్రికన్ యూనియన్ సభ్యునిగా చేరింది.
కరతాళ ధ్వనుల మధ్య మోదీ ప్రకటన..
జీ20 సభ్యులందరి అంగీకారంతో ఆఫ్రియన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. అనంతరం ఆఫ్రికన్ యూనియన్ అధినేతను శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఆనందంతో వచ్చిప్రధాని మోదీని హత్తుకుని ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిణామంతో సమావేశంలో హర్షధ్వానాలు మోగాయి.
మోదీ ప్రారంభోపన్యాసం..
అంతకుముందు జీ20 సదస్సులో ప్రధాని మోడీ ప్రారంభోపన్యాసం చేశారు. మొదటగా మొరాకో భూకంప మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రపంచం మొత్తం మొరాకోకు అండగా నిలవాలన్నారు. వారికి అవసరమైన సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. జీ20 అధ్యక్ష హోదాలో భారత్ సభ్యులందరికీ స్వాగతం పలుకుతోందన్నారు ప్రధాని మోదీ. ప్రస్తుతం 21వ శతాబ్దంలో ప్రపంచానికి కొత్త దిశ, దశ సూచించడానికి ఇదే కీలక సమయమని అన్నారు. పాత సవాళ్లు ఇప్పుడు కొత్త సమాధానాలు కోరుతున్నాయన్నారు. అందుకే మనం హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్‌తో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ సూచించారు.
అప నమ్మకాన్ని పారదోలాలి..
కోవిడ్ 19 సంక్షోభం తర్వాత ప్రపంచంలో విశ్వాస రాహిత్యం ఏర్పడిందని.. యుద్ధం ఈ అపనమ్మకాన్ని మరింత పెంచిందన్నారు ప్రధాని మోదీ. కోవిడ్‌ను ఓడించిన మనం ఈ విశ్వాస రాహిత్యంపై కూడా విజయం సాధించాలన్నారు. మనం అందరం కలిసి ప్రపంచంలో నెలకొన్న అపనమ్మకాన్ని పారదోలుతామని చెప్పారు. ఈ క్రమంలో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్ మంత్రం మనకు మార్గదర్శిగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.