Jagan- Chandrababu: అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే.. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే.. ఈ పాట దశాబ్దల కిందట వచ్చినా ఇప్పటికీ బహుళ ప్రాచుర్యంలో ఉంది. అడవారి అంతరంగాన్ని గుర్తించడం, అంచనా వేయడం చాలా కష్టమని కవి హృదయం చెబుతోంది. అయితే ఏపీలో వైసీపీ నాయకుల వ్యవహార శైలి కూడా అలానే ఉంటుంది. ప్రత్యేక సిట్యువేషన్ క్రియేట్ చేయడం, టార్గెట్ ను గురిపెట్టి కొట్టడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఇటువంటి టాస్కులను సక్సెస్ చేయడానికి అక్కడ ఒక ప్రత్యేక టీమ్ ఉంటుంది. దానికి ఎక్కువగా మన ప్రభుత్వ సలహాదారుడు, జగన్ కట్టుబానిస సజ్జల రామక్రిష్ణారెడ్డి పర్యవేక్షిస్తారు. ఆయన కొడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా అదే చేశారు. ఆయన్ను కట్టడి చేసేందుకు ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి పోలీస్ లాను తెరపైకి తెచ్చి అమలు చేస్తున్నారు. అయితే దానికి షరతు విధించారు. ఒక్క వైసీపీకి తప్ప మిగతా రాజకీయ పక్షాలకు పోలీస్ లా వర్తిస్తుందనేలా అనేక వెసులబాటులు ఇస్తూ జీవో ఇచ్చారు.

ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన ఏనాడో జరిగిపోయింది. పాలనలో న్యాయవ్యవస్థ ప్రమేయం ఏమిటి? అని ప్రశ్నించినప్పుడే ఇది కన్ఫర్మ్ అయ్యింది. ఏపీకి చెందిన జస్టిస్ ఎన్వీరమణ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిపాదించిన సమయంలో ఏపీ నుంచి అభ్యంతర లేఖలు వెళ్లినప్పుడే జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రజలకు తమకు అధికారమిచ్చారు. తాము అవసరమైతే చట్టాలు, న్యాయాలు తయారుచేసుకుంటామన్న రీతిలో ఏపీ పాలకుల వ్యవహార శైలి నడిచింది. అడ్డగోలు చట్టాలు తేవడం, అందులో ఉన్న అంశాలను తమకు నచ్చిన రీతిలో అన్వయించుకోవడం ఏపీలో అధికార పార్టీకే చెల్లింది.
అయితే ప్రస్తుతానికైతే ప్రభుత్వం జారీ చేసిన జీవోను చంద్రబాబు ఒక్కరిపైనే ప్రయోగిస్తున్నారు.ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించకుండా వేలాది మంది పోలీసులతో అడ్డగిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు మాత్రం అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైవేతో పాటు రాష్ట్ర రహదారులపై కిలోమీటర్ల మేర ర్యాలీలు, రోడ్ షోలు ఏర్పాటుచేస్తున్నారు. దానిని సాక్షి మీడియాలో గొప్పగా చూపుతున్నారు. అదేంటి అంటే ర్యాలీలు ఎవరు చేసుకోవద్దన్నారు అని సజ్జల వంటి వారు చమత్కారంగా, తెలివితేటలుగా సమాధానమిస్తున్నారు.

ఓ వైపు ప్రతిపక్ష నాయకుడ్ని కట్టడి చేసి.. తమ పార్టీ నేతలను ప్రోత్సహమందిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు తెరతీస్తున్న వికృత చర్యలను ఏమనాలి? ఎలా అభివర్ణించాలి? ఇంతలా ఉల్లంఘన జరుగుతున్నా.. దానిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నా కుహనా మేధావుల జాడలేదు. వారు ఎక్కడున్నారో తెలియడం లేదు. ప్రజాస్వామ్యం ఇంత దారుణంగా వంచించబడుతున్నా వారి గొంతులు పెగలడం లేదు. ఏపీలో విపక్ష నాయకులను కట్టడి చేయడానికి..తాము ప్రజల్లో వెళ్లేందుకు ఎంతకైనా తెగిస్తారని అర్ధమైంది. అయితే ఒకటి చెప్పగలం ప్రజాస్వామ్యంలో విపక్షాలను అణచివేసే క్రమంలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడం ఖాయం. తమ పక్కన తప్పు జరిగినా ప్రజలు అభ్యంతరం చెప్పకపోవచ్చు. కానీ పదేపదే అదే తప్పు జరిగితే మాత్రం ప్రజాప్రతిఘటన ఎదురుకాక తప్పదు. అప్పుడు ఈ అంతులేని విజయాలు, సంపూర్ణ గెలుపులు పటాపంచలు కాక తప్పదు.