Modi Is Not On Arogyasree Cards: నిధులు కేంద్రానివి.. దర్పం రాష్ట్ర వైసీసీ సర్కారుది అన్నట్టంది వ్యవహారం. ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన(పీఎంజేఏవై) కింద కేంద్రం విడుదల చేస్తున్న నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం లోగోపై ప్రధాని మోదీ ఫొటో ముద్రించకపోవడం ఏమిటి? ఇది మంచి పద్ధతేనా? సీఎం జగన్, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఫొటోలు ముద్రించి.. ప్రధానిది విస్మరించడం ధర్మమేనా.. ఇది మీకు తగునా? అంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి శుక్రవారం విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించారు.ఆరోగ్యమిత్ర హెల్ప్‌డెస్క్ సిబ్బందితో మాట్లాడారు. అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్‌పై వైఎస్, జగన్‌ల ఫొటోలు మాత్రమే ఉండటాన్ని చూసి, ప్రధాని ఫొటోను ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందన్న సంగతి తెలుసా? అని నిలదీశారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో జీజీహెచ్‌లోని ఆరోగ్యమిత్ర హెల్ప్ డెస్క్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారత్ పథకం లోగోను(తెల్లకాగితాలపై బ్లాక్ అండ్ వైట్ ప్రింట్) గోడకు అతికించడం, తాత్కాలికంగా నిలబెట్టిన బ్యానర్‌ను చూసి మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె. నివాస్ ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరును కేంద్రమంత్రికి వివరించే ప్రయత్నం చేయగా.. మంత్రి భారతి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసిన ఆరోగ్యశ్రీ కార్డును చూపిస్తూ.. దానిపై ప్రధాని ఫొటో ఎందుకు లేదని నిలదీశారు. దీనికి కమిషనర్ నివాస్ మౌనం వహించారు. వైసీపీకి చెందిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆ సమయంలో మంత్రి పక్కనే ఉన్నప్పటికీ.. ఆయన కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయారు.

ఈ హాస్పిటల్ పనితీరుపై..
అంతకుముందు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమం కింద రోగులకు హెల్త్‌కార్డులను జారీ చేసే ప్రక్రియపై కేంద్రమంత్రి ఆరా తీశారు. అక్కడ ఓ తాత్కాలిక ఉద్యోగి ఈ-హాస్పిటల్ పనుల గురించి కేంద్రమంత్రికి సుదీర్ఘంగా వివరిస్తూ తత్తరపాటుకు గురికావడంతో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె. నివాస్ వచ్చి ఈ-హాస్పిటల్ పనుల్లో ప్రగతిని మంత్రికి వివరించారు. అనంతరం, సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారత్, ఈ-సంజీవని టెలీ మెడిసిన్ సర్వీసెస్, విజయవాడ హబ్‌ను మంత్రి పరిశీలించారు. ఈ-టెలీమెడిసిన్ కేంద్రాన్ని కూడా హడావుడిగానే ఏర్పాటు చేశారనే విషయాన్ని గమనించిన కేంద్రమంత్రి.. అక్కడి నుంచి టెలీకాల్ మాట్లాడారు. అనంతరం, అదే మెడికల్ కాలేజీలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇటీవలే ఏర్పాటు చేసిన జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ను కేంద్ర మంత్రి పరిశీలించారు. ల్యాబ్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న జూనియర్ డాక్టర్లతో మంత్రి కాసేపు ముచ్చటించారు. జీజీహెచ్‌లో సూపరింటెండెంట్ డాక్టర్ బి. సౌభాగ్యలక్ష్మి, ఆర్‌ఎంవో డాక్టర్ యు. శోభ తదితర వైద్యాధికారులు, సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్యలక్ష్మి తదితరులు స్వాగతం పలికారు.
కేంద్ర పెద్దలు సీరియస్..
కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పథకాలుగా చెప్పుకుంటుండడంపై కేంద్ర పెద్దలు సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. దీనిపై శాఖల వారీగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొవిడ్ కష్టకాలంలో కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యానికి గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం మంగళం పలికింది. వివిధ కారణాలు చూపుతూ బియ్యం అందించలేదు. షార్టెక్ష్ బియ్యం కారణం చూపుతూ పథకానికి పేద లబ్ధిదారులకు దూరం చేసింది. ఇది చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆరోగ్యశ్రీ పథకం లోగోపై మోదీ ఫొటో లేకపోవడం విషయాన్ని కేంద్ర మంత్రి కేంద్ర పెద్దల ద్రుష్టకి తీసుకెళ్లే అవకాశముంది.
[…] […]