Free Electricity: ఉచిత విద్యుత్ అద్దెకు ఉండేవారికి ఇస్తారా? సర్కార్ నిర్ణయం ఇదీ!

ప్రజాపాలనలో భాగంగా డిసెంబర్‌ 26 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఐదు గ్యారంటీలకు అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వీటి ఆధారంగా దరఖాస్తుదారులకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Written By: Dharma, Updated On : February 6, 2024 3:28 pm
Follow us on

Free Electricity: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ఆరు గ్యారంటీలు కాంగ్రెస్‌ గెలుపులో కీలకమయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నారు. మార్చి నుంచి మరో రెండు గ్యారంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందలో ఒకటి రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌ కాగా, రెండోది 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌.

ఉచిత విద్యుత్‌పై అద్దెకు ఉండేవారిలో ఆందోళన..
ప్రజాపాలనలో భాగంగా డిసెంబర్‌ 26 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఐదు గ్యారంటీలకు అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వీటి ఆధారంగా దరఖాస్తుదారులకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అర్హులను గుర్తించాలని విద్యుత్‌ శాఖ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దరఖాస్తుల ఆధారంగా విద్యుత్‌ అధికారులు సర్వే మొదలు పెట్టారు.

రేషన్‌కార్డు ఉన్నవారికే..
ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ రేషన్‌ కార్డు ఉన్నవారికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌ కార్డు లేనివారికి కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత అందిస్తామని తెలిపింది. దీంతో ప్రస్తుతం రేషన్‌కార్డు ఉండి 200 లోపు విద్యుత్‌ వినియోగించేవారిని గుర్తించేందుకు సర్వే చేస్తున్నారు. గత బకాయిలు పెండింగ్‌ లేనివారు, వివాదాలు లేనివారిని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తిస్తారు.

అద్దెకు ఉన్నవారిలో ఆందోళన..
ఇక ప్రభుత్వం అద్దెకు ఉంటున్నవారి విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పట్టణాల్లో చాలా వరకు అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. వీరిలో చాలా మందికి తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అద్దెకు ఉంటున్నవారిని లబ్ధిదారులుగా కాకుండా యజమానులను లబ్ధిదారులుగా గుర్తిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తమకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవని అద్దెకు ఉంటున్నవారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.

స్పందించిన విద్యుత్‌ అధికారులు..
అద్దెకు ఉంటున్నవారి ఆందోళనపై విద్యుత్‌ అధికారులు స్పందించారు. తప్పుడు వార్తలను నమ్మొద్దని టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌ అధికారులు సూచించారు. ఈ పథకానికి అద్దెకు ఉండేవారు కూడా అర్హులని పేర్కొన్నారు. సర్వే సమయంలోనే లబ్ధిదారులను గుర్తిస్తామని తెలిపింది. విద్యుత్‌ కనెక్షన్‌ ఉన్న ఇంట్లో ప్రస్తుం ఉంటున్నవారి వివరాల ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వెల్లడించారు. దీంతో అద్దెకు ఉంటున్నవారు కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పొందే అవకాశం ఏర్పడింది.