Siddham Sabha: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు జగన్ శంఖారావం పూరించారు. సిద్ధం పేరిట ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించారు. ఇప్పటికే మూడు సభలను నిర్వహించారు. నాలుగో సభకు సైతం సర్వం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 మంది సిట్టింగులను మార్చి జగన్ ఆశ్చర్యపరిచారు. ఈ సంఖ్య 100 వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్చి ఎన్నికల ప్రచారంలో మునిగి తేలాలని జగన్ భావిస్తున్నారు. సిద్ధం సభలకు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇప్పుడు నాలుగో సభను ఏర్పాటు చేసి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాలని భావిస్తున్నారు.తద్వారా విపక్షాల కు చెక్ చెప్పాలనిచూస్తున్నారు.
సిద్ధం సభల నిర్వహణలో జగన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనే సభల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. విశాఖ జిల్లా భీమిలిలో తొలి సభను నిర్వహించారు. తరువాత దెందులూరులో, ఇటీవల రాప్తాడులోసభలు ఏర్పాటు చేశారు. ఒక దానికి మించి మరో సభ ఉండేలా ప్లాన్ చేశారు. భారీ జన సమీకరణ చేశారు. వందలాది ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి లక్షలాది జనాలను తరలించడంలో సక్సెస్ అయ్యారు. ఈ సభలు వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి. అదే స్ఫూర్తితో మిగతా ప్రాంతాల్లో సైతం సిద్ధం సభలు ఏర్పాటు చేయాలని జగన్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.
పల్నాడులో టిడిపికి అనుకూలమైన ప్రాంతంగా పేరుగాంచిన చిలకలూరిపేటలో నాలుగో సిద్ధం సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ నియోజకవర్గంలోని బొప్పూడి వద్ద 200 ఎకరాల స్థలంలో సభకు నిర్ణయం తీసుకున్నారు. ఇది జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంగణం. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో 54 నియోజకవర్గాల నుంచిక్యాడర్ను ఈ సభకు తరలించి సక్సెస్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సభలకు సంబంధించిన ప్రాంతాల్లో.. తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం గెలుపొందుతూ వచ్చింది. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ గెలిచింది. ఇక్కడ భారీ సభల నిర్వహణ ద్వారా టిడిపి పై మానసికంగా వై చేయి సాధించాలని జగన్ భావిస్తున్నారు. తద్వారా వైసిపి క్యాడర్లో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చేయాలని చూస్తున్నారు. చిలకలూరిపేట సభలో మేనిఫెస్టో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ప్రయత్నాలు ఎన్నికల్లో ఎంతవరకు సఫలం అవుతాయో చూడాలి.